బాలయ్య నమ్మకమే నిజమైంది.. 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి సినిమా

ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలతో పోటీగా సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకున్నటున్నారు బాలకృష్ణ. ఇటీవలే బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

బాలయ్య నమ్మకమే నిజమైంది.. 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి సినిమా
Balakrishna

Updated on: Jun 01, 2026 | 8:03 PM

నరసింహ నాయుడు.. తెలుగు సినిమా చరిత్రలో ఒక అద్భుత అధ్యాయం 25 సంవత్సరాలు నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటించిన నరసింహ నాయుడు చిత్రం 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సినిమా విశేషాలు, విజయ రహస్యాలు, తెర వెనుక సంఘటనలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ చిత్రం కేవలం ఒక విజయవంతమైన సినిమా మాత్రమే కాదు, తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో బాలకృష్ణ తండ్రి పాత్రకు నటుడిని ఎంపిక చేయడం ఒక కీలకమైన చర్చ. పండితేనే సినిమాకు బలమని గుర్తించిన రచయిత చిన్నికృష్ణ, ఎవరూ ఊహించని విధంగా కె. విశ్వనాథ్ పేరును సూచించారు.  హెవీ యాక్షన్ మూవీ, ఫ్యాక్షన్ సినిమాలో విశ్వనాథ్‌ను ఒప్పించడం ఎలా అని సందేహాలు వ్యక్తమయ్యాయి. చిన్నికృష్ణ చెన్నైలోని కూరగాయల మార్కెట్‌లో విశ్వనాథ్‌ను కలిసి కథ, పాత్ర వివరించారు. సత్యనారాయణ లేదా రంగనాథ్ లాంటి నటుల ఛాతిపై విలన్ కాలు పెడితే ప్రేక్షకులకు కోపం రాదని, కానీ విశ్వనాథ్ లాంటి గౌరవనీయ వ్యక్తిపై కాలు పెడితే ఆడిటోరియంలోని ప్రేక్షకులకు ఆగ్రహం వస్తుందని, అదే సినిమాకు పెద్ద బలం అవుతుందని చిన్నికృష్ణ చేసిన లాజిక్ వాదనకు విశ్వనాథ్ అంగీకరించారు. ఆ సీన్ థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సినిమా విడుదల కావడానికి రెండు వారాల ముందే బాలకృష్ణ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి, సినిమా విజయంపై తన అపూర్వ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. “ఎప్పుడెప్పుడు జనవరి 11 వస్తుందా, నా చెవులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని వింటాయా అని ఎదురుచూస్తున్నాను” అని చెప్పడం ఆయన జీవితంలో అరుదైన సంఘటన. విడుదల ముందు రెండు సీన్లు బ్యాలెన్స్ ఉన్నప్పుడు, నిడివి ఎక్కువ ఉన్న ఒక డైలాగ్ సీన్‌పై పరుచూరి గోపాలకృష్ణ దృష్టి పెట్టారు. దీనిని మరింత పవర్ ఫుల్ గా మార్చడానికి, ఆయన ఎన్టీ రామారావు గారిని ఊహించుకుని, “కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా” అనే అనూహ్య డైలాగ్ ను రాశారు. ఈ డైలాగ్ విని చిన్నికృష్ణ ఆ సినిమా 200 రోజులు కాదు 300 రోజులు ఆడుతుందని చెప్పేశారు.

ఎడిటింగ్ సమయంలో 17,000 అడుగుల ఫుటేజ్ రావడంతో, సుదీర్ఘమైన సన్నివేశాలను కత్తిరించాల్సి వచ్చింది. ముఖ్యంగా మొదటి సగంలో చాలా భాగం తగ్గించడంతో ఇంటర్వెల్ పాయింట్ కూడా మారిపోయింది. తొలుత 30 టాటా సుమోలతో రైల్వే స్టేషన్ సన్నివేశాన్ని ఇంటర్వెల్‌గా అనుకున్నా.., చివరికి బాలకృష్ణ-సిమ్రాన్ పెళ్లి సన్నివేశాన్ని ఇంటర్వెల్‌గా ఖరారు చేశారు. 2001 జనవరి 11న విడుదలైన నరసింహ నాయుడు, అదే రోజు విడుదలైన మృగరాజు, మరుసటి రోజు వచ్చిన దేవి పుత్రుడు చిత్రాలను అధిగమించి సంక్రాంతి విజేతగా నిలిచింది. 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం 25 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించి, తెలుగు సినిమా చరిత్రలో 25 కోట్లు వసూలు చేసిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇది సౌత్ ఇండియాలో 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన తొలి సినిమా. ఈ చిత్రానికి బాలకృష్ణకు ఉత్తమ నటుడిగా తొలి నంది అవార్డు లభించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us