TVK Vijay: ఎన్టీఆర్ నుంచి విజయ్‌ వరకు.. ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఇప్పుడేమో..

తమిళనాడు ముఖ్యమంత్రిగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో హీరో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాలు గెల్చుకుని చరిత్ర సృష్టంచింది.

TVK Vijay: ఎన్టీఆర్ నుంచి విజయ్‌ వరకు.. ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటి ఎవరో తెలుసా? ఇప్పుడేమో..
TVK Vijay

Updated on: May 09, 2026 | 7:18 PM

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన తమిళనాడు రాజకీయాలు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లను గెల్చుకున్న టీవీకే పార్టీ అధికారం చేపట్టనుంది. హీరో విజయ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇతర పార్టీలు మద్దతు ఇవ్వడంతో ఇప్పుడు విజయ్ కు 120 ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తానికి ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించబోతున్న నటుడిగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇదిలా ఉంటే విజయ్‌తో పాటు మరో ఆరుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఒకే ఒక నటి ఎవరో తెలుసా? తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్‌, జయలలిత, స్టాలిన్‌తో ఆమె నటించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌తోనూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక రేపో, ఎల్లుండో ముఖ్యమంత్ర పీఠం ఎక్కబోతున్న విజయ్ తోనూ కలిసి యాక్ట్ చేశారు. తద్వారా ఏడుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఏకైక నటిగా ఆమె రికార్డు అందుకుంది. అన్నట్లు ఆ దిగ్గజ నటి మన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?

నాటకాలతో మొదలు పెట్టి సుమారు 1000కు పైగా సినిమాల్లో నటించిన మనోరమ గురించి మన తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సినిమా కెరీర్ లో మూడు తరాల నటులతో కలిసి నటించిన ఆమెఎన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. అంతేకాదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు.

ఏడుగురు ముఖ్యమంత్రులతో..

  • తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన సీఎన్ అన్నాదురైతో మనోరమకు ప్రత్యేక అనుబంధముంది. ఈయన రచించి నటించిన వేలైక్కారి, శివాజీ కండ హిందూ సామ్రాజ్యం తదితర నాటకాల్లో మనోరమ, అన్నాదురై కలిసి నటించారు.
  • ఇక ‘ఉదయ సూరియన్’ నాటకంలో కరుణానిధితో కలిసి మనోరమ కీలక పాత్ర పోషించడం విశేషం.
  • ఎమ్‌జీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్‌‌తో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించారు మనోరమ… అన్బేవా, పదగొట్టి తదితర చిత్రాల్లో వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
  • జయలలితతోనూ మనోరమ చాలా సినిమాల్లో నటించారు. కందన్ కరుణై, గలట్టా కల్యాణం, పట్టికాడ పట్టణమ చిత్రాల్లో వీరి నటనకు మంచి పేరొచ్చింది. కేవలం సినిమాల్లోనే కాకుండా బయట కూడా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేదని చెబుతుంటారు.
  • ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొన్ని సినిమాల్లో నటించారు. విజయ్‌కాంత్ హీరోగా చేసిన ‘మక్కళ్ అనైయిట్టల్’ చిత్రంలో మనోరమతో కలిసి తెర పంచుకున్నారు స్టాలిన్.
  • తమిళంలో వందల చిత్రాల్లో నటించిన మనోరమ.. తెలుగులోనూ పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్ నటించిన నర్తనశాల, పాతాళభైరవి, గుండమ్మ కథ, మాయా బజార్, ఛాలెంజ్ రాముడు తదితర చిత్రాల్లో మనోరమ కీలక పాత్రలు పోషించారు.
  • ఇక రేపో, ఎల్లుండో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న విజయ్ దళపతితోనూ మనోరమ కలిసి నటించారు. రసిగన్, దేవా లాంటి సినిమాల్లో వీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

కాగా ఈ దిగ్గజ నటి 2015 అక్టోబర్ లో వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు.

ఇవి కూడా చదవండి

నటి మనోరమ..

Aachi Manorama

Follow Us