Puri Jagannadh: గుర్తు పెట్టుకోండి.. ఆ మూడు మన జీవితాంతం ఉండవు : పూరి జగన్నాథ్‌

|

Dec 07, 2024 | 8:31 AM

పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ఈ మధ్య బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాదించలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది.

Puri Jagannadh: గుర్తు పెట్టుకోండి.. ఆ మూడు మన జీవితాంతం ఉండవు : పూరి జగన్నాథ్‌
Puri Jagannath
Follow us on

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ మధ్యకాలంలో పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా బాక్దాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఇక తాజాగా పూరి మ్యూజింగ్స్‌లో భాగంగా ‘రీప్లేసబుల్‌’ అనే అంశంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ”ఒక సిస్టమ్‌, ఆర్గనైజేషన్‌, రిలేషన్‌షిప్‌ ఇలా దేనిలో ఉన్నవారినైనా ఇంకొకరితో రీప్లేస్‌ చేయొచ్చు. ‘నేను లేకపోతే ఈ కంపెనీ.. ఆఫీస్‌.. ఇల్లు.. రాష్ట్రం.. దేశం.. ఏమైపోతుందో’ అని చాలా అనుకుంటారు. ఏం నష్టం లేదు. అన్నీ మామూలుగానే నడుస్తూ ఉంటాయి. మీలో ఉన్న ప్రత్యేక లక్షణం వల్ల జీవితంలో ఈ స్థాయిలో ఉండవచ్చు. మీకున్న అనుభవం, మీరు ఆలోచించే విధానం, మీరు ఆఫీస్‌కు వచ్చినప్పుడు మీతో వచ్చే ఎనర్జీ ఇలా ఎన్నో మంచి లక్షణాలు మీలో ఉండవచ్చు. ఆ విషయంలో మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. అయినా, మీ టైమ్‌ బాగుండకపోయినా, దగ్గర పడినా అందరూ పక్కన పెడతారు”

”ఎన్నో ఏళ్లు పనిచేసిన కంపెనీలో మీ రిటర్మైంట్‌ రోజున బాగా భావోద్వేగానికి గురవుతూ మాట్లాడుతూ ఉంటారు. అప్పటివరకూ సాధించిన వాటి గురించి చెబుతూ ఉంటారు. కానీ, ఇటు మీ స్పీచ్‌ నడుస్తుంటే, మీ యాక్సిస్‌కార్డును ఇంకొకడు డి-యాక్టివేట్‌ చేస్తుంటాడు. మరొకడు మీ అఫీషియల్‌ మెయిల్‌ ఐడీ పాస్‌వర్డ్‌ మార్చేస్తాడు. మీకు కాఫీ ఇచ్చే బాయ్‌ అప్పటికే మీ డెస్క్‌ ఖాళీ చేసి, అన్నీ మీ కారులో పెట్టేసుంటాడు. మీ సహచర ఉద్యోగులు మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతున్నామని కన్నీళ్లతో చప్పట్లు కొడుతూ ఉంటారు. అదే సమయంలో మీ తర్వాత ఆ కుర్చీలో కూర్చొనేవాడు మీ పక్కనే బాధగా నిలబడి, మీ స్పీచ్‌ అయిపోగానే ఓ పెగ్‌ వేద్దామని చూస్తుంటాడు. వీడ్కోలు పార్టీ అయిపోగానే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా ఇంట్లోనే”

”ఆఫీస్‌ నుంచి ఎవరైనా వచ్చి మీ సలహాలు, సూచనలు తీసుకుంటారని ఎదురు చూడొద్దు. ఎవడూ రాడు. ఏదైనా సలహా కావాలంటే చాట్‌-జీపీటీని అడుగుతాడు. ప్రపంచం ఎంతో వేగంతో పరిగెడుతోంది. కళ్లు మూసి తెరిస్తే అన్నీ మారిపోతాయి. మనం అందరూ మర్చిపోకూడని విషయం ఏంటో తెలుసా? స్టీవ్‌జాబ్స్‌ను అతని సొంత కంపెనీలోనే రెండు సార్లు మార్చారు. జీవితమంతా నిరూపించుకుంటూ బతకలేం. మంచి పొజిషన్‌.. సక్సెస్‌లో ఉన్నప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. ‘నేనే లేకపోతే’ అని ప్రతి అత్తగారు అనుకుంటుంది. కానీ, కొత్త కోడలు వస్తుంది. ఆమెకంటే ఇల్లు బాగా చూసుకుంటుంది”

”ఒకరి స్థానాన్ని మరొకరితో భర్తీ చేయడం అనేది అవమానించడం కాదు. మీరు చేయాల్సిన పనులు అక్కడ పూర్తయ్యాయని అర్థం. మిగిలిన జీవితం హాయిగా బతకండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోండి. కొత్త సవాళ్లను ఎదుర్కోండి. మిమ్మల్ని వీరు గౌరవించుకోండి. ఇంకా ఆఫీస్‌ను నెత్తిమీద పెట్టుకుని మోయద్దు. హాలీడేకు వెళ్లండి. మీ పెంపుడు జంతువుతో సరదాగా ఆడుకోండి. పవర్‌.. మనీ.. సక్సెస్‌.. జీవితాంతం ఉండవు. అవి ఉన్నప్పుడు లేనప్పుడూ బతకడం నేర్చుకోవాలి. ‘నేనే లేకపోతే..’ అనే ఆలోచన వస్తే, ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఈ లోకంలో అమ్మ, ఆమె చేసిన వంట తప్ప, మిగతావాటిని అందరూ మార్చవచ్చు” అని పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.