Anil Ravipudi: వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా?

టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుల జాబితా తీస్తే ఆయన పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. కామెడీని యాక్షన్‌తో కలిపి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన శైలే వేరు. సంక్రాంతికి ఆయన సినిమా విడుదలవుతోందంటే బాక్సాఫీస్ వద్ద సందడి పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోతారు.

Anil Ravipudi: వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా?
Anil Ravipudi

Updated on: Jan 21, 2026 | 7:41 AM

ఇటీవల ‘మన శంకరవరప్రసాద్’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నస్టార్ డైరెక్టర్ అనిల్​ రావిపూడి తాజాగా తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తన కెరీర్ మొదట్లో ఎదురైన సవాళ్లు, అగ్ర హీరోలతో చేయాలనుకుంటున్న సినిమాలు, ముఖ్యంగా భవిష్యత్తులో తాను తీయబోయే డ్రీమ్ ప్రాజెక్టులపై అనిల్​ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అందరినీ నవ్వించే ఈ దర్శకుడి మనసులో ఉన్న ఆ భారీ పౌరాణిక చిత్రం ఏంటి? ఎన్టీఆర్‌తో సినిమా ఎందుకు ఆగిపోయింది?

అనిల్ రావిపూడి ప్రస్థానంలో ‘పటాస్’ సినిమా ఒక మలుపు. ఆ సినిమానే తన అడ్రస్ అని ఆయన గర్వంగా చెబుతారు. “ఆ సమయంలో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, నా మీద నమ్మకంతో పటాస్ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఆయన ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకపోతే, ఈరోజు సుప్రీం, రాజా ది గ్రేట్, F2, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ లాంటి సినిమాలు ఉండేవి కావు” అని అనిల్ పేర్కొన్నారు. కళ్యాణ్ రామ్ చేసిన ఆ మేలుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని స్పష్టం చేశారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనేది ప్రతి దర్శకుడి కోరిక. అనిల్ రావిపూడి కూడా ఒక సందర్భంలో ఎన్టీఆర్‌ను కలిసి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారట. “రాజా ది గ్రేట్ షూటింగ్ సమయంలో తారక్‌ను కలిసి ఒక లైన్ చెప్పాను. అది ఆయనకు బాగా నచ్చి, పూర్తి కథ వింటానని గంటన్నర సమయం కేటాయించమన్నారు. కానీ అప్పుడు నాకు సమయం కుదరకపోవడంతో ఆ గొప్ప అవకాశం చేజారింది” అని అనిల్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్ ‘జై లవకుశ’కు ఓకే చెప్పడం జరిగిపోయింది. అయితే భవిష్యత్తులో మంచి కథతో వెళ్తే ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం కచ్చితంగా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Kalyan Ram Anil N Ntr

బఫెట్ లాంటి కెరీర్..

అందరి స్టార్ హీరోలతో సినిమాలు చేయాలనేది తన లక్ష్యమని అనిల్ రావిపూడి తెలిపారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలతో పనిచేయాలని ఉందని చెప్పారు. దీనిపై ఆయన ఒక ఆసక్తికరమైన పోలిక చెప్పారు. “బఫెట్‌లో అన్ని రకాల వంటకాలు రుచి చూసినట్లు, నా కడుపు నిండే వరకు టాలీవుడ్ లోని అందరి హీరోలతో సినిమాలు చేయాలనుంది” అని సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్, మిగిలిన హీరోల కోసం కథలు సిద్ధం చేస్తున్నారు.

డ్రీమ్ ప్రాజెక్టులు..

కేవలం కామెడీ సినిమాలకే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో సినిమాలు తీయాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారు. ఆయన డ్రీమ్ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ‘ఆదిత్య 369’ లాంటి ఒక టైమ్ ట్రావెల్ లేదా ఫిక్షన్ సినిమా చేయాలని ఉందట. దానితో పాటు భారతీయ పురాణాలైన రామాయణం లేదా మహాభారతం ఆధారంగా ఒక గొప్ప పౌరాణిక చిత్రాన్ని డైరెక్ట్ చేయాలని తన కోరిక అని వెల్లడించారు. సరైన సమయం, స్థాయి వచ్చినప్పుడు వీటిని తప్పకుండా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనిల్ రావిపూడి అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, ఆయనలో ఒక గొప్ప విజన్ ఉన్న దర్శకుడు ఉన్నాడని ఈ విషయాల ద్వారా అర్థమవుతుంది. త్వరలోనే ఆయన అగ్ర హీరోలతో కలిసి మరిన్ని సంచలనాలు సృష్టించాలని కోరుకుందాం.