
షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సందీప్ రాజ్ కూడా ఒకరు. ముఖ్యంగా చాయ్ బిస్కెట్ షార్ట్ ఫిల్మ్స్ తో పాపులారిటీ సొంతం చేసుకున్నాడు సందీప్. ఆ తర్వాత కలర్ ఫొటో సినిమాతో దర్శకుడిగా మారాడు. ఓటీటీలో రిలీజైనా మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. అంతేకాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలు, సిరీస్ లకు రచయితగా పనిచేస్తూనే డైరెక్టర్ గా తన నెక్స్ట్ సినిమాని పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు సందీప్. సినిమాల సంగతి పక్కన పెడితే.. త్వరలోనే ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ పెళ్లిపీటలెక్కనున్నాడు. తను తెరకెక్కించిన కలర్ ఫొటో సినిమాలోనే ఒక కీలక పాత్రలో మెరిసిన చాందిని రావు తో కలిసి ఏడడుగులు నడవనున్నాడు. తాజాగా సందీప్ రాజ్, చాందినీ రావుల నిశ్చితార్థం జరిగింది. ఎప్పుడు, ఎక్కడ జరిగిందో కానీ తమ ఎంగేజ్ మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారీ లవ్ బర్డ్స్. దీంతో వీరి ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాబోయే దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
ఆదివారమే పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ సందీప్ రాజ్- చాందినీలకు ‘కంగ్రాచ్యులేషన్స్’ అని విషెస్ చెప్పింది. అలాగే హీరో ఆది సాయి కుమార్, చైతన్య రావు తదితరులు వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
చాందినీ రావు విషయానికి వస్తే.. కలర్ ఫొటోతో పాటు సందీప్ రాజ్ కథ అందించిన ‘హెడ్స్ అండ్ టేల్స్’ వెబ్ సిరీస్లో ఓ కీలక పాత్ర చేసింది. ‘రణస్థలి’తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ కనిపించిందీ అందాల తార. అయితే కలర్ ఫొటో షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. డిసెంబర్ 7న ఏడు కొండల వెంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో వీరు పెళ్లి చేసుకోనున్నారని సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి