
టాలీవుడ్ ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎలా ఉండేది, చిరంజీవి రాకతో అది ఎలా మారింది అనే అంశాలపై సినీ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లే సినిమాల కాస్టింగ్ నిర్ణయించేవారని, కానీ చిరంజీవి ఒక ప్రభంజనంలా మారిన తర్వాత సమీకరణాలన్నీ మారిపోయాయని ఆయన వివరించారు. పూర్వం డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో నవయుగ ఫిలిమ్స్, లక్ష్మీ ఫిలిమ్స్ వంటి సంస్థల ఆధిపత్యం ఉండేదని శ్రీకాంత్ తెలిపారు. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లే సినిమాలో ఏ నటులు ఉండాలి, ఏ కమెడియన్ ఉంటే బాగుంటుందో నిర్ణయించేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. నిర్మాతలు కూడా డిస్ట్రిబ్యూటర్ల కోసం ఎదురుచూసి, వారిని సాదరంగా ఆహ్వానించేవారని పేర్కొన్నారు. అప్పట్లో ఆంధ్రా, సీడెడ్, నైజాం అనే ప్రాంతాల వారీగా మాత్రమే కొనుగోళ్లు జరిగేవి.
ఇది చదవండి: అందుకే శ్రీదేవి నాకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది.. సీనియర్ నటి
చిరంజీవి హీరోగా ఎదిగిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ జిల్లాల వారీగా విడిపోయిందని శ్రీకాంత్ వివరించారు. చిరంజీవి సినిమా అంటే హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా కాకినాడ వంటి కేంద్రాల్లో 100 రోజులు ఆడేదని ఆయన తెలిపారు. ఉదాహరణకు, ‘మృగరాజు’ వంటి ప్లాప్ సినిమా కూడా కాకినాడలో 100 రోజులు ఆడిందని, అలాగే ‘మాస్టర్’ సినిమా ఏకంగా 175 రోజులు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచిందని ఆయన వెల్లడించారు. చిరంజీవి సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ.. ఆయన తీసుకునే పారితోషికం కంటే డిస్ట్రిబ్యూటర్లకు ఐదారు రెట్లు ఎక్కువ లాభం వచ్చేదని శ్రీకాంత్ సంచలన విషయం చెప్పారు. ఒక సెంటర్‌లో మెయిన్ థియేటర్ నిండిపోయి, పక్కనే ఉన్న మినీ థియేటర్లలో షో వేసినా అవి కూడా క్షణాల్లో ఫుల్ అయిపోయేవని ఆయన తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ఈ స్థాయి బాక్సాఫీస్ ప్రభంజనం కేవలం చిరంజీవి వల్లే సాధ్యమైందని ఆయన కొనియాడారు. అల్లు అరవింద్ 1987లో తూర్పు గోదావరి జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ సంస్థను ప్రారంభించారని, ఆ తర్వాత 1991లో ‘రౌడీ అల్లుడు’ సినిమాతో నైజాం మార్కెట్‌లోకి ప్రవేశించారని శ్రీకాంత్ వివరించారు. అప్పటి నుండి గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగు రాష్ట్రాల్లో వందలాది సినిమాలను పంపిణీ చేస్తూ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
ఇది చదవండి: అన్నయ్యతో ఠాగూర్ అయ్యాక.. పవన్‌తో చేయాల్సిన సినిమా ఆగింది.. ఎందుకంటే.?