
2005లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమా చంద్రముఖి. సూపర్ స్టార్ రజినీకాంత్, నయనతార, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. చంద్రముఖి చిత్రానికి దర్శకత్వం వహించిన పి.వాసు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. అలాగే ఇప్పటికే హార్రర్ కామెడీ జోనర్ చిత్రాల్లో నటించిన లారెన్స్ మరోసారి ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో చంద్రముఖి 2పై మరింత ఆసక్తి నెలకొంది.
ఈ సినిమా వినాయక చవితి కానుకగా విడుదల చేయాల్సింది. కానీ పలు కారణాలతో ఈ సినిమాను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. దీంతో ప్రస్తుతం చిత్రయూనిట్ ఈ మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రముఖి 2 గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరలవుతుంది.
అదేంటంటే.. ఈసినిమా రన్ టైమ్ 170 నిమిషాలు ఉందట. అంటే 2 గంటల 50 నిమిషాలు. సాధారణంగా అన్ని సినిమాలు దాదాపు రెండున్నర గంటలకు కాస్త అటు ఇటుగానే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు చంద్రముఖి 2 మాత్రం దాదాపు మూడు గంటలకు దగ్గర ఉండడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. అంతసేపు ప్రేక్షకులను థియేటర్లలో ఉంచడం అంటే మాములు విషయం కాదని.. కథ, కథనంతోపాటు విజువల్ ఎఫెక్ట్స్ సైతం అలరించాల్సిందే. ఈ సినిమాలో వడివేలు, మహిమా నంబియార్, లక్ష్మీ మీనన్, సురేష్ మీనన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.