అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకం విడిచి వెళ్లినప్పటికీ అభిమానుల గుండెల్లో ఎప్పుడూ చిరంజీవిగా ఉంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీదేవి లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిని ఊపేసిన శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది. ఆమె చేయని పాత్ర లేదు. ఆమె చేయని డ్యాన్స్‌లేదు. ఆమె పలికించని హావబావాలు లేవు. ఎన్నో పాత్రల్లో.. ఎన్నో రకాలుగా జీవించిన ఈ వసంత కోకిల.. ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆమె జీవితంలోని ఎన్నో ఆసక్తికర విషయాలను ఇప్పుడు పుస్తక రూపంలో తెస్తున్నారు. ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ పేరుతో శ్రీదేవి బయోగ్రఫీ రాబోతోంది.
అయితే దుబాయ్ లోని ఓ వివాహానికి వెళ్లిన ఆమె విగత జీవిగా మారారు. ఆమె మరణం ఇప్పటికీ ఒక మిస్టరీనే.. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్ లోని ఓ హోటల్ లో బాత్ టబ్బులో అనుమానాస్పదంగా మరణించారు. శ్రీదేవి మరణం పై అనేక అనుమానాలు ఉన్నాయి. పెళ్లి జరిగింది 2018 ఫిబ్రవరి 20 తేదీ అయితే ఆమె 24 వరకు దుబాయ్‌లోనే ఎందుకు ఉన్నారు? మిగిలిన అందరు స్వస్థలాలకు వెళ్లినా, చివరకు బోనీకపూర్ కూడా ముంబై వెళ్లినా కూడా ఆమె దుబాయ్‌లోనే ఎందుకున్నారు? ఇక దుబాయ్ పోలీసులు చెప్పినట్లు ఆమె మద్యం సేవించి ఉందని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ నెల 24న ఆమె వర్థంతి సందర్భంగా శ్రీదేవి భర్త బోని కపూర్ శ్రీదేవి చివరి ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. లాస్ట్ ఫోటో అంటూ బంధువులతో శ్రీ దేవి కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీదేవి చివరి ఫోటో పై మీరూ ఓ లుక్కేయండి.