
యామీ గౌతమ్.. హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం కాక ముందే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ యాడ్‌తో దేశవ్యాప్తంగా బాగా ఫేమస్ అయిపోయిందీ అందాల తార. ఆ తర్వాత రవిబాబు ‘నువ్విలా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అల్లు శిరిష్ గౌరవం, నితిన్ కొరియర్ బాయ్ కల్యాణ్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు బాగా చేరువైంది. అయితే ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. అలా విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నటి యామీ గౌతమ్ ఒక మంచి’శుభవార్త’ చెప్పింది. ఆమె మే 20న అక్షయ తృతీయ రోజున ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుందీ అందాల తార. ఈ పోస్ట్ ద్వారానే తన పిల్లాడి పేరును కూడా రివీల్ చేసింది . యామీ 2021లో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌ను వివాహం చేసుకుంది. ఈ మూడేళ్ల వైవాహిక బంధానికి ప్రతీకగా ఇప్పుడు యామీ, ఆదిత్య తమ జీవితంలోకి ఒక బిడ్డను ఆహ్వానించారు. తమ కుమారుడికి ‘వేదవిద్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారీ లవ్లీ కపుల్.
వేద, విద్ అనే రెండు పదాల నుండి ఏర్పడిన సంస్కృత పేరు వేదవిద్. ఈ పేరుకు అర్థం వేదాల పరిజ్ఞానం ఉన్నవాడు అని అర్థం. విష్ణువు పేరు కూడా వస్తుంది. ‘సూర్య హాస్పిటల్ డాక్టర్ భూపేందర్ అవస్థి, డాక్టర్ రంజనా ధనుతోపాటు అసాధారణమైన అంకితభావం గల నిపుణులైన వైద్యబృందానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆస్పత్రి వైద్యుల నైపుణ్యం, అవిశ్రాంత కృషి వల్లనే మా జీవితాల్లోకి ఈ ఆనందం వచ్చింది. పవిత్రమైన అక్షయ తృతీయ నాడు వచ్చిన మా ముద్దుల కొడుకు వేదవిద్ని పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాం. దయచేసి అతనికి మీ ఆశీర్వాదాలు అందించండి.. ప్రేమ వర్షం కురిపించండి’ సోషల్ మీడియా వేదికగా అందరినీ కోరారు యామీ దంపతులు.
కాగా ‘ఆర్టికల్ 370’ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా తాను గర్భం దాల్చినట్లు ప్రకటించింది యామీ. ఇప్పుడు పండంటి బిడ్డను ప్రసవించింది. యామీ పోస్ట్‌పై పలువురు సెలబ్రిటీలు కామెంట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయుష్మాన్ ఖురానా, మృణాల్ ఠాకూర్, నేహా ధూపియాతో సహా పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు యామీ దంపతులకు విషెస్ తెలిపారు. ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘విక్కీ డోనర్’ సినిమాలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది యామీ. ఆ తర్వాత ‘కాబిల్’, ‘బద్లాపూర్’, ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’, ‘బాలా’, ‘భూత్ పోలీస్’, ‘ఏ గురువారం’, ‘దసవి’, ‘చోర్ నికల్ కే భాగా’, ‘ఓ మై గాడ్ 2’ చిత్రాల్లో నటించింది. ‘, ‘ఆర్టికల్ 370’ లేడీ ఓరియంటెడ్ సినిమాలతోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.