Bigg Boss 10 : బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. ఆ ముగ్గురు తప్ప మిగిలినవారందరూ

బిగ్ బాస్ హౌస్‌లో సోమవారం వచ్చిందంటే చాలు.. నామినేషన్స్ రచ్చ మొదలవుతుంది. వారం మొత్తం జరిగే ఆట ఒక ఎత్తయితే.. నామినేషన్స్ ప్రక్రియ మరో ఎత్తు. కంటెస్టెంట్ల మధ్య ఉన్న విభేదాలు, మనస్పర్థలు, గ్రూప్ పాలిటిక్స్ అన్నీ ఈ సమయంలో బయటపడుతుంటాయి.

Bigg Boss 10 : బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. ఆ ముగ్గురు తప్ప మిగిలినవారందరూ
Biggboss 10

Updated on: Sep 15, 2026 | 7:17 AM

తాజాగా సెప్టెంబర్ 14న ప్రసారమైన ఎపిసోడ్‌లోనూ ఇదే జరిగింది. అయితే ఈసారి నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మార్చారు. నేరుగా ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇవ్వకుండా.. ముందుగా టాస్క్‌లో గెలిచి ఆ అర్హత సాధించాల్సి వచ్చింది. ఈ ప్రక్రియలో 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వెళ్లగా.. ముగ్గురు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

రోహిత్‌ను టార్గెట్ చేసిన త్రిగుణ్

ఎపిసోడ్ ప్రారంభం నుంచే త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. చరణ్ హౌస్ నుంచి వెళ్లిపోవడానికి రోహిత్ కూడా ఒక కారణమనే అభిప్రాయాన్ని త్రిగుణ్ వ్యక్తం చేశాడు. చరణ్‌ను సెలెక్ట్ చేసింది అందరూ కలిసి కాదా.? అంటూ రోహిత్‌ను ఒప్పించే ప్రయత్నం చేశాడు. అయితే చరణ్ తన వల్ల వెళ్లిపోలేదని రోహిత్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ త్రిగుణ్ తన వాదనను ఆపలేదు. ప్రపంచమంతా రోహిత్ తప్పు అని చెప్పినా.. అతను ఒప్పుకోడంటూ కామెంట్స్ చేశాడు త్రిగుణ్. ఇక రాత్రి సమయంలోనూ రోహిత్‌ను వదల్లేదు త్రిగుణ్. సింక్‌లో ఉన్న గిన్నెలను తాను కడుగుతానని ముందుకు వచ్చాడు. అయితే రోహిత్ తన పని తాను చేసుకుంటానని చెప్పడంతో.. ఇద్దరి మధ్య మరోసారి మాటలు నడిచాయి. నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌లలో తనపై ఫిట్టింగ్‌లు పెట్టొద్దంటూ రోహిత్ ముందుగానే చెప్పాడు. అదే విషయాన్ని త్రిగుణ్ నామినేషన్స్ సమయంలో ప్రస్తావిస్తూ.. ‘‘నాకు అవకాశం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో’’ అంటూ హెచ్చరించాడు.

వంశీతోనూ త్రిగుణ్ అదే చర్చ

రోహిత్‌తో డిస్కషన్ అయిపోయిన తర్వాత ముగిసిన తర్వాత కిచెన్‌లో వంట చేస్తున్న వంశీ దగ్గరకు వెళ్లిన త్రిగుణ్.. హౌస్‌లో కొత్త గ్రూప్ ఏర్పడిందంటూ తన అభిప్రాయాలను చెప్పాడు. కొందరు కంటెస్టెంట్లు గ్రూప్‌గా మారారని, వారిలో ఒకరు ఎప్పటికీ మారరని కామెంట్స్ చేశాడు. టాస్క్‌లు గెలవడం, ఇంటి పనులు సక్రమంగా చేయడం ద్వారానే హౌస్‌లో స్ట్రాంగ్ పొజిషన్ సాధించవచ్చని వంశీకి వివరించాడు. తర్వాత రోజు ఉదయం కూడా త్రిగుణ్ తన మాటల దాడిని కొనసాగించాడు. ఝాన్సీ ఇంటి పనుల్లో సహాయం చేయడం లేదంటూ వంశీతో చర్చ మొదలుపెట్టాడు. అంతేకాకుండా, నాగార్జున ఇచ్చిన ఎంగిలి కప్పులను రోహిత్ ఇంకా శుభ్రం చేయలేదని మరోసారి ప్రస్తావించాడు. చివరకు రోహిత్ గ్లౌజులు వేసుకుని ఆ కప్పులను క్లీన్ చేశాడు. త్రిగుణ్ మాత్రం అవి సరిగ్గా శుభ్రం చేశాడా లేదా అని పరిశీలిస్తూ కనిపించాడు. ఈ విషయంలో షాలిని కూడా త్రిగుణ్‌కు మద్దతుగా నిలిచింది.

నామినేషన్స్‌కు ముందు రోప్ టాస్క్

మాములుగా బిగ్ బాస్ నామినేషన్స్‌లో ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి బిగ్ బాస్ కొత్త నిబంధన తీసుకొచ్చారు. ముందుగా ఇద్దరిద్దరుగా కంటెస్టెంట్లను పోటీకి దింపి.. తాళ్లతో కట్టిన రోప్‌ను విడదీసి, అక్కడ ఉన్న గొడ్డలిని ముందుగా ఎవరు అందుకుంటారో వారు నామినేషన్ చేసే అర్హత పొందేలా టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో గెలిచినవారికి నామినేట్ చేసే అధికారం లభించగా.. ఓడిపోయినవారు నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్లాల్సి వచ్చింది. దీంతో హౌస్‌లో పోటీ మరింత రసవత్తరంగా మారింది.

సుధీర్ గెలుపు.. త్రిగుణ్, షాలినికి నామినేషన్స్

మొదటగా ఝాన్సీ, సుధీర్ పోటీ పడగా.. సుధీర్ టాస్క్‌లో విజయం సాధించాడు. గొడ్డలిని అందుకున్న అనంతరం త్రిగుణ్, షాలినిలను నామినేట్ చేశాడు. త్రిగుణ్ తరచూ మాటలు మార్చడం, ఒకసారి చెప్పిన విషయాన్ని మరోసారి మార్చడం తనకు నచ్చడం లేదని సుధీర్ విమర్శించాడు. తన పాయింట్లను స్పష్టంగా, సూటిగా చెప్పిన సుధీర్.. త్రిగుణ్‌కు పెద్దగా సమాధానం చెప్పే అవకాశం ఇవ్వలేదు. అనంతరం షాలినిని కూడా నామినేట్ చేస్తూ.. వాష్‌రూమ్ క్లీనింగ్ పని నుంచి తప్పించుకోవడానికి తన పవర్‌ను మిస్ యూజ్ చేసిందని అన్నాడు సుధీర్.

దేబ్జానీ చేతిలోనూ త్రిగుణ్‌కు నామినేషన్

తదుపరి దేబ్జానీ, కృష్ణుడు పోటీ పడగా.. దేబ్జానీ టాస్క్‌లో గెలిచి గొడ్డలిని అందుకుంది. ఆమె కూడా త్రిగుణ్‌నే నామినేట్ చేసింది. చైత్ర విషయంలో ఒక మాట తమ దగ్గర, మరో మాట వేరే వాళ్ల దగ్గర చెప్పడం తనకు నచ్చలేదని దేబ్జానీ చెప్పింది. ఏదైనా ఉంటే నేరుగా చెప్పాలని, మాటలు మార్చకూడదని చెప్పుకొచ్చింది. అయితే త్రిగుణ్ మాత్రం తాను అలా మాట్లాడలేదంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య వాదన చోటుచేసుకుంది.

త్రిగుణ్‌పై రోహిత్ తీవ్ర ఆరోపణలు

ఆ తర్వాత రోహిత్, వర్షిణి మధ్య టాస్క్ జరగగా.. రోహిత్ విజయం సాధించాడు. వెంటనే త్రిగుణ్, ఝాన్సీలను నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా త్రిగుణ్‌పై రోహిత్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన ముందు ఒకలా, వెనుక మరోలా మాట్లాడుతున్నాడని ఆరోపించాడు. మానిటర్‌గా ఉంటూ మైక్రో మేనేజ్‌మెంట్ చేస్తున్నాడని విమర్శించాడు. అంతేకాకుండా.. ‘‘సృష్టిని సుధీర్ బ్రోపైకి తోమడానికి పంపిస్తున్నాను’’ అంటూ త్రిగుణ్ చేసిన మాటలు రోహిత్ తప్పుబట్టాడు. నేషనల్ టెలివిజన్‌లో ఒక అమ్మాయిని అబ్బాయిపైకి పంపిస్తున్నానని చెప్పడం సరైన పద్ధతి కాదని, అది నీచమైన మాటలు అని మండిపడ్డాడు. దీనిపై స్పందించిన త్రిగుణ్.. తన స్టడీ గురించి రోహిత్ మాట్లాడినందుకే ఆ కామెంట్స్ చేశానని, అందుకు తాను శిక్ష కూడా అనుభవించానని సమర్థించుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం కొనసాగింది.

షాలినిపై నరేష్ ఫైర్

తర్వాత నరేష్, షాలిని టాస్క్‌లో తలపడగా.. నరేష్ అద్భుతంగా ఆడి గెలిచాడు. అనంతరం షాలినిని నామినేట్ చేశాడు. తన పాయింట్లను వివరిస్తూ షాలినితో చాలా సేపు డిస్కషన్ నడిచింది. ఆటలోనే కాకుండా మాటల్లోనూ ఆమెపై పైచేయి సాధించేందుకు ప్రయత్నించాడు నరేష్. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికరమైన వాదన జరిగింది.

త్రిగుణ్ వర్సెస్ సుధీర్.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

తర్వాత త్రిగుణ్, సృష్టి పోటీ పడగా.. త్రిగుణ్ టాస్క్‌లో గెలిచాడు. వెంటనే సుధీర్‌ను నామినేట్ చేశాడు. అయితే ఈసారి సుధీర్ ఏమాత్రం తగ్గలేదు. త్రిగుణ్ చెప్పిన ప్రతి పాయింట్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. సృష్టిని ఉద్దేశించి ‘‘నిన్ను తోముతుంది’’ అంటూ త్రిగుణ్ చేసిన వ్యాఖ్యలను సుధీర్ తీవ్రంగా తప్పుబట్టాడు. అంతేకాకుండా.. హౌస్‌లో ఎవరూ పిలవకపోయినా త్రిగుణ్ తానే వచ్చి ప్రతి గ్రూప్‌లో చేరుతున్నాడని ఆరోపించాడు. గ్రూప్ ఏర్పడుతోందంటూ మాట్లాడే త్రిగుణ్.. తానే ప్రతి గ్రూప్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు. గోడమీద పిల్లిలా వ్యవహరించకుండా ఒక నిర్ణయంతో ఉండాలని సుధీర్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

 అమన్ విజయం.. రాంప్రసాద్, ఝాన్సీలకు నామినేషన్స్

తర్వాత ముఖేష్, అమన్ మధ్య జరిగిన టాస్క్‌లో అమన్ విజయం సాధించాడు. గొడ్డలిని అందుకున్న అనంతరం రాంప్రసాద్‌ను నామినేట్ చేశాడు. తనకు చెప్పాల్సిన విషయాలను సూటిగా వివరించాడు. ఆ తర్వాత ఝాన్సీని నామినేట్ చేస్తూ.. తన దగ్గరకు వచ్చి బాగా గేమ్ ఆడుతున్నావని చెప్పి, తరువాత మాత్రం తాను కన్ఫ్యూజ్ అయ్యానని వ్యాఖ్యానించిందని ఆరోపించాడు. ఝాన్సీ మాటలు మార్చుతూ సేఫ్ గేమ్ ఆడుతోందని అమన్ అన్నాడు. దీనిపై ఝాన్సీ స్పందిస్తూ.. తాను ఎలాంటి గ్రూప్ గేమ్ ఆడటం లేదని, తన ఆట తాను ఆడుతున్నానని చెప్పింది. ప్రేక్షకులు తన ప్రతిభను చూస్తున్నారని, తన పవర్ ఏంటో నిరూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేసింది.

చివర్లో వంశీకి విజయం.. దేబ్జానీ, ముఖేష్‌లకు నామినేషన్స్

చివరిగా రాంప్రసాద్, వంశీ పోటీ పడగా.. వంశీ టాస్క్‌లో గెలిచాడు. అనంతరం దేబ్జానీని నామినేట్ చేశాడు. దేబ్జానీ తనను ఉద్దేశించి చేసిన ఓ కామెంట్ తనను చాలా బాధపెట్టిందని వంశీ చెప్పాడు. ఆమె సరదాగా అన్నదో, సీరియస్‌గా అన్నదో తెలియదని.. కానీ తాను మాత్రం హర్ట్ అయ్యానని చెప్పుకొచ్చాడు. ఆమె కావాలని అలా చేసి ఉండకపోవచ్చని చెప్పినప్పటికీ.. తన బాధ కలిగిందని నామినేషన్ వేశాడు. ఆ తర్వాత ముఖేష్‌ను నామినేట్ చేశాడు వంశీ. రూమ్‌లో ట్రిమ్ చేయడం తనకు నచ్చలేదని, అందుకే నామినేట్ చేస్తున్నానని చెప్పాడు. తాను కావాలని అలా చేయలేదని, ఆ తర్వాత శుభ్రం చేశానని ముఖేష్ వివరణ ఇచ్చాడు.

ఈ వారం నామినేషన్స్‌లోకి వెళ్లిన 11 మంది

నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి మొత్తం 11 మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లోకి వెళ్లారు.

1. షాలిని
2. త్రిగుణ్
3. ఝాన్సీ
4. దేబ్జానీ
5. రాంప్రసాద్
6. ముఖేష్
7. కృష్ణుడు
8. సుధీర్
9. సృష్టి
10. వర్షిణి
11. రోహిత్

అయితే అమన్, వంశీ, నరేష్‌లు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us