Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు.. కారణం ఇదే

|

Dec 25, 2024 | 7:29 AM

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు షాకిచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. నిబంధనలకు విరుద్దంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందడంపై నోటీసులు జారీ చేసింది. తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేయాలని డెడ్‌లైన్ విధించింది. ఇంతకీ వ్యూహం మాటున వ్యూస్ లెక్కేంటి.? సినిమా విషయంలో వర్మకు నోటీసులు పంపిస్తూ ఝలక్‌ ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌.

Ram Gopal Varma: రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసులు.. కారణం ఇదే
Rgv
Follow us on
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్‌తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రామ్‌గోపాల్‌ వర్మ. దీనిపై వేర్వేరు చోట్ల కేసు నమోదయ్యాయి. లేటెస్ట్‌గా అదే సినిమా విషయంలో వర్మకు నోటీసులు పంపిస్తూ ఝలక్‌ ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్‌.
వ్యూహం సినిమాకు నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించడాన్ని సీరియస్‌గా పరిగణించింది ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్. వ్యూహం సినిమాకు తగినన్ని వ్యూస్ లేకపోయినా ఫైబర్ నెట్ నుంచి కోటి రూపాయలకు పైగా అనుచితంగా లబ్ది పొందడంపై వర్మతో పాటు నాటి ఫైబర్‌నెట్ ఎండీ సహా ఐదుగురికి నోటీసులు జారీ చేసింది. 15రోజుల్లోగా వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. సహజంగా అవగాహన ఒప్పందాలు చేసుకునే సమయంలో ఎవరు.. ఎవరితో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు.. నియమ నిబంధనలేంటో స్పష్టంగా పేర్కొనాలి. కానీ ఇవేవీ గత ఫైబర్ నెట్ కార్పొరేషన్ పాటించలేదన్నది ప్రస్తుత చైర్మన్‌ జీవిరెడ్డి ఆరోపణ. వ్యూహం చిత్ర బృందంతో కార్పొరేషన్‌ చేసుకున్న ఒప్పందంలో అస్సైనీల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆర్జీవీ మేకర్స్‌కు చెందిన రబ్బర్ స్టాంప్‌, నిర్మాతల పేర్లు లేవు. ఏజీఎం సంతకం ఉన్నప్పటికీ.. ఆ సైన్ కింద ఆయన పేరు రాయలేదు. ఇలాంటి ఒప్పందాలు చెల్లవంటున్నారు జీవీ రెడ్డి.
సాంకేతిక కమిటీ సిఫారసులు లేకుండా చాలా సినిమాలను ప్రసారం చేసేందుకు వర్మతో అప్పటి ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఒప్పందం చేసుకుంది. ప్రతి సినిమాకు వచ్చే వ్యూస్‌తో సమకూరే ఆదాయాన్ని చెరిసగం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. వ్యూహం ఫస్ట్ పార్ట్‌కి 1845.. సెకండ్ పార్ట్‌కి 383 వ్యూస్‌తో మాత్రమే వచ్చాయి. కానీ రెండు పార్ట్‌లకు 2లక్షల వ్యూస్ వచ్చినట్టుగా చూపించారు. ఒక్కో వ్యూస్‌కి వందకు బదులు పదకొండు వేల చొప్పున.. కోటి 14లక్షల 96 వేల 610 రూపాయలు చెల్లించారన్నది జీవీ రెడ్డి ఆరోపణ. ఈ మొత్తం చెల్లించాలని ఆర్జీవీకి నోటీసులిచ్చామన్నారాయన. ఆర్జీవీకి జీవీ రెడ్డి పంపిన నోటీసుల్ని కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తోంది వైసీపీ. నిరాధారణ ఆరోపణలతో తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఆ పార్టీ నేత అంబటి రాంబాబు. జీవీ రెడ్డి ఆరోపిస్తున్నట్టు వ్యూహం వెబ్‌సిరీస్‌కి ఎక్కువ చెల్లింపులు జరిగాయా..? ఒప్పందంలో రూల్స్‌ని బ్రేక్ చేశారా? ఇప్పటికే సోషల్ మీడియాలో వ్యూహాం పోస్టర్లపై ఆర్జీవీపై కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పుడదే మూవీకి సంబంధించి నోటీసులు వెళ్లాయి. మరి దీనిపై ఆర్జీవీ ఏం చేయబోతున్నారు..? వర్మ ఆస్కింగ్ అంటూ ట్విస్ట్ ఇస్తారా? లేదంటే తీసుకున్న మొత్తం తిరిగి ఇచ్చేస్తారా అన్నది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.