
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం ఉంది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను బయట పెట్టారు. ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు హీరోయిన్లో పని చేయించుకుని పారితోషికాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఇలానే నిర్మాణ సంస్థ తన రెమ్యునరేషన్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రన్ రాజా రన్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది సీరత్ కపూర్. ఆ తర్వాత టైగర్, ఒక్క క్షణం, రాజుగారి గది 2, కొలంబస, టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా, భామా కాలాపం 2, మనమే, ఉషా పరిణయం తదితర సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక నటిగా మెప్పించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. షూటింగ్ పూర్తయి నాలుగు నెలలు అవుతున్న తనకు రావాల్సిన పారితోషికం ఇవ్వట్లేదంటూ తన పోస్టులో రాసుకొచ్చింది.
‘ సినిమా షూటింగ్ పూర్తయ్యి నాలుగు నెలలు గడిచినా సరే సంబంధిత ప్రొడక్షన్ టీమ్ నా రెమ్యునరేషన్ ఇవ్వలేదు. నా కుటుంబంలో అత్యవసర వైద్య పరిస్థితి ఉందని చెప్పినా స్పందించడం లేదు. చాలా ఓపిక, సహనంతో ఎదురుచూస్తున్నా. నా టీమ్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. టీమ్‌కు ఇచ్చిన చెక్కు కూడా బౌన్స్ అయింది. దీన్ని ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించండి. ఇలాంటి విషయాల్లో కాస్త బాధ్యతతో వ్యవహరించండి. లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది’ అని సీరత్ కపూర్ సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆమెను ఇబ్బంది పెడుతున్న ఆ నిర్మాణ సంస్థ, నిర్మాత పేర్లను కానీ సీరత్ కపూర్ బయటపెట్టలేదు. ప్రస్తుతం ఈ పోస్ట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.
— Seerat Kapoor (@IamSeeratKapoor) March 7, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.