
ప్రముఖ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కీలక మలుపులను, ముఖ్యంగా తన వ్యక్తిగత ప్రయాణంలో ఎదురైన భావోద్వేగ సంఘటనలను పంచుకున్నారు. తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ, తన తల్లిదండ్రులు, ఒక అన్నయ్యతో కూడిన చిన్న కుటుంబాన్ని గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అన్నయ్య మరణించడంతో ప్రస్తుతం తాను, తన భర్త మాత్రమే ఉన్నామని తెలిపారు. తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన తనను పెద్ద స్టార్ అవ్వాలని కోరుకున్నారని చెప్పారు. దేవాలయం సినిమా షూటింగ్ సమయంలో, తండ్రి చితికి నిప్పు పెట్టే సన్నివేశంలో తాను నటిస్తుండగా, చెన్నైలో తన నిజమైన తండ్రి మరణించారని విజయశాంతి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తనకు వెంటనే తెలియదని, షూటింగ్ పూర్తయిన తర్వాతే దర్శకుడు టీ. కృష్ణ ద్వారా తెలిసిందని వివరించారు. ఆ తర్వాత ఏడాది వ్యవధిలోనే తన తల్లి కూడా మరణించడంతో జీవితంలో పెద్ద దెబ్బ తగిలిందని, చిన్నతనంలోనే తల్లిదండ్రులిద్దరినీ కోల్పోవడం తనను తీవ్రంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల మరణం తర్వాత జీవిత విలువ, బాధ్యత, ఒంటరితనం తనను వెంటాడాయని ఆమె అన్నారు. అయితే, సరైన సమయంలో తన భర్త జీవితంలోకి వచ్చి, పెద్దల అండ లేకుండానే తనను వివాహం చేసుకుని తోడుగా నిలిచారని విజయశాంతి తెలిపారు. ఆయన రాక తన జీవితంలో సరైన నిర్ణయమని, దేవుడు స్వయంగా పంపిన గొప్ప బహుమతి అని ఆమె పేర్కొన్నారు. వివాహం తర్వాత చాలా మంది మహిళలు ఇంటికే పరిమితం కాగా, తన భర్త తనలోని ప్రతిభను గుర్తించి, కెరీర్‌ను కొనసాగించమని ప్రోత్సహించారని చెప్పారు. కర్తవ్యం వంటి చిత్రాలను ఆయన స్వయంగా నిర్మించారని, ఆ తర్వాత లేడీ అమితాబ్, ఓసేయ్ రాములమ్మ వంటి విజయాలు సాధ్యమయ్యాయని ఆమె స్పష్టం చేశారు. సినిమా రంగంలో మహిళగా హీరోలకు సమానమైన ఇమేజ్ సంపాదించుకోవడం ఎంత కష్టమో విజయశాంతి వివరించారు. గ్రాఫిక్స్ లేని ఆ రోజుల్లో, డూప్ లేకుండా సొంతంగా ఫైట్స్ చేయాల్సి వచ్చిందని, అందుకు శారీరకంగా, మానసికంగా ఎంతో శిక్షణ అవసరమైందని తెలిపారు. తన భర్త కేవలం సినీ కెరీర్‌కు మాత్రమే కాకుండా, తన రాజకీయ ప్రయాణానికి కూడా పూర్తి మద్దతు ఇచ్చారని, సరైన మార్గంలో నడిపించారని ఆమె కృతజ్ఞతా భావంతో గుర్తు చేసుకున్నారు. తన భర్త ప్రోత్సాహం లేకపోతే ఈ విజయాలు సాధ్యమయ్యేవి కావని విజయశాంతి దృఢంగా తెలిపారు.
విజయశాంతి భర్త పేరు శ్రీనివాస్ ప్రసాద్. ఆయన అప్పట్లో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అయితే ఆయన యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి ఫోటోలు తప్పితే.. తాజా ఫోటోలు అందుబాటులో లేవు.
Also Read: నూటొక్క జిల్లాల అందగాడు నూతన ప్రసాద్ విషాద గాథ