
ప్రముఖ నటి శ్రీలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని హృదయ విదారకమైన విషయాలను పంచుకున్నారు. ఆమె బాల్యం, కుటుంబ నేపథ్యం నుంచి తన కెరీర్, కుటుంబంలో చోటుచేసుకున్న విషాదకర సంఘటనల వరకు అనేక అంశాలను వెల్లడించారు. శ్రీలక్ష్మి చెన్నైలో పుట్టి పెరిగారు. ఆ తర్వాత తన తండ్రి సినిమా రంగంలోకి ప్రవేశించడంతో కుటుంబం హైదరాబాద్‌కు మారింది. వారు సుమారు 14 సంవత్సరాలు హైదరాబాద్‌లో నివసించారు. 1980 వరకు అక్కడే ఉన్న తర్వాత, తన తండ్రి మరణించడంతో తిరిగి చెన్నైకి వచ్చి, అక్కడే తన నటనా జీవితాన్ని కొనసాగించారు. తన కుటుంబంలో జరిగిన తొలి విషాదం గురించి మాట్లాడుతూ, తనకన్నా పెద్దదైన ఒక సోదరి సుమారు 50 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిందని శ్రీలక్ష్మి తెలిపారు. ఈ సంఘటన తాను సినీ పరిశ్రమలోకి వచ్చిన కొద్ది కాలానికే జరిగిందని పేర్కొన్నారు. ఆమె సోదరి మరణానంతరం, తాను కళాకారిణిగా కొనసాగుతుండగా, సోదరుడు రాజేష్ కూడా సినీ రంగంలోకి వచ్చారని చెప్పారు.
శ్రీలక్ష్మి తన సోదరుడు హీరో రాజేష్ జీవితంలోని విషాద ఘట్టాలను కూడా వివరించారు. రాజేష్ జీవితం ఒక ట్రాజెడీ అని, అతనిది స్వయంకృతాపరాధం అని పేర్కొన్నారు. చిన్న వయసులోనే తప్పు నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యంగా వివాహం విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం, మద్యపానానికి బానిస కావడం అతని జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆమె అన్నారు. రాజేష్ 38 సంవత్సరాల వయసులోనే నలుగురు పిల్లలను కలిగి ఉండి, తన జీవితాన్ని ముగించాడని శ్రీలక్ష్మి వెల్లడించారు. “38 ఏళ్లు అంటే ఏముందండీ?” అని ఆయన అకాల మరణం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, రాజేష్ ఇద్దరు పిల్లల అకాల మరణాలు తమ కుటుంబాన్ని మరింతగా కలచివేశాయని శ్రీలక్ష్మి తెలిపారు. రాజేష్ పెద్ద కుమారుడు (21 సంవత్సరాలు) ఆత్మహత్య చేసుకున్నాడని, అతని స్నేహితురాలి ఇంట్లో ఉరి వేసుకుని మరణించినట్లు సమాచారం వచ్చిందని ఆమె చెప్పారు. మృతదేహాన్ని భారతీరాజా హాస్పిటల్‌కు తరలించారని, అయితే అతని మరణం వెనుక ఉన్న అసలు కారణం తమకు ఇప్పటికీ తెలియదని శ్రీలక్ష్మి పేర్కొన్నారు.
రెండవ కుమారుడు (20 సంవత్సరాలు) వినాయక చవితి పండగ ముందు రోజు చెంగల్పట్టు నుంచి చెన్నైకి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అతివేగంగా కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టడంతో, మూడు పల్టీలు కొట్టి అక్కడికక్కడే మరణించాడని, డ్రైవింగ్ చేసిన స్నేహితుడు, వెనక కూర్చున్న వారు బ్రతికినా, రాజేష్ కుమారుడు స్పాట్ డెడ్ అయ్యాడని ఆమె వివరించారు. ఈ పిల్లవాడు అచ్చు రాజేష్ లాగే ఉండేవాడని, అతనిని చూసి రాజేష్‌ను తలచుకునేవారని శ్రీలక్ష్మి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషాదాల తర్వాత, మిగిలిన కుటుంబ సభ్యుల బాధ్యతలను తాను స్వీకరించినట్లు శ్రీలక్ష్మి తెలిపారు. వారి చదువులన్నింటినీ తాను చూసుకోలేదని, బ్రతకడమే కష్టమైనప్పుడు చదువులు ఎలా చూస్తామని ప్రశ్నించారు. అయితే, వారికి ఆహారం, బట్టలు వంటి ప్రాథమిక అవసరాలు లోటు లేకుండా చూసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. “దేవుడు నాకు డ్యూటీ వేశాడు” అని పేర్కొంటూ, తన వంతు సహాయం చేసినట్లు తెలిపారు. కాగా రాజేష్ కుమార్తె ఐశ్వర్య ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.
Actor Rajesh
Also Read: నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు టాప్ యాక్టర్..