Actress : 15 ఏళ్లకే ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది.. 21 ఏళ్లకే ఉరివేసుకుని సూసైడ్.. ఈ హీరోయిన్ మరణం ఇప్పటికీ మిస్టరీనే..

సినీరంగుల ప్రపంచంలో అందరి జీవితాలు ఊహించినంత అందంగా ఉండవు. తెరపై తమ అభినయంతో మెప్పించిన ఎంతో మంది తారల జీవితాలు తెర వెనుక ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎన్నో ఆశలతో సినిమాల్లోకి అడుగుపెట్టిన తారలు అర్థాంతరంగా తనువు చాలించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం కేవలం 21 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే ఉండిపోయింది.

Actress : 15 ఏళ్లకే ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాసింది.. 21 ఏళ్లకే ఉరివేసుకుని సూసైడ్.. ఈ హీరోయిన్ మరణం ఇప్పటికీ మిస్టరీనే..
Shobha

Updated on: Jun 08, 2026 | 1:12 PM

1980 మే 1, అంతా కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్న రోజు. మద్రాసులో స్టూడియోలు మూతబడ్డాయి. చెన్నైలో తారలు ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గా అదే రోజు, డబ్బు, పేరు, ప్రతిష్టలు అన్నీ ఉన్న 21 ఏళ్ల యువ నటి శోభ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, చివరకు గ్లామర్ ప్రపంచాన్ని శాశ్వతంగా వీడిపోయింది. ఒక వారం రోజుల క్రితం మాత్రమే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు స్వీకరించిన ఆమె, అంతలోనే విషాదకరంగా కన్నుమూయడం యావత్ సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. శోభ జీవితం, మరణం రెండూ మిస్టరీలే. ఆమె దర్శకుడు బాలు మహేంద్రతో వివాహం చేసుకుని అప్పటికి సరిగ్గా 100 రోజులు. ఆమె నటించిన పసి, అలియాద కోలంగళ్ చిత్రాలు విడుదలయ్యి 150 రోజులు. ఇంత చిన్న వయసులోనే ఆమె జీవితం ఎందుకు ముగిసింది? ఆమె ఉరి వేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ సాగే ఆమె జీవిత గాథే ఇది.

శోభ అసలు పేరు మహాలక్ష్మి మీనన్. తండ్రి కే.పి. మీనన్, తల్లి ప్రేమ. ఆమె తల్లి కూడా ఆర్టిస్ట్ కావడంతో, ఆమె ప్రోత్సాహంతో శోభ 1966లో బాలనటిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తట్టంగళ్ తిరుక్కప్పడమ్ ఆమె తొలి చిత్రం. ఇందులో బేబీ మహాలక్ష్మి పేరుతో మహానటి సావిత్రి, కే.ఆర్. విజయ వంటి దిగ్గజాలతో కలిసి నటించి మెప్పించింది. మరుసటి సంవత్సరం మలయాళంలో ఉద్యోగస్థ చిత్రంలో బేబీ శోభగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 1972లో సింధూరచెప్పు చిత్రానికి గాను ఉత్తమ బాలనటిగా కేరళ ప్రభుత్వ అవార్డు పొందింది. ఆ తర్వాత మలయాళంతో పాటు కన్నడలో అపరిచిత, కోకిల వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది.

ఆ సమయంలో దర్శకుడు బాలు మహేంద్ర శోభ ఇంటికి పక్కనే ఉండేవారు. ఆయన తన భార్య అఖిలతో కలిసి తరచుగా వీరి ఇంటికి వచ్చేవారు. శోభ అతన్ని అంకుల్ అని పిలిచేది. బాలు మహేంద్ర ఆమెను తన కూతురితో సమానంగా భావించేవారు. శోభ ప్రతిభను గుర్తించిన బాలు మహేంద్ర, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన తరం మారింది తెలుగు చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తూ, శోభకు అందులో నటించే అవకాశం కల్పించారు. ఈ చిత్రం నంది అవార్డు సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత బాలు మహేంద్ర దర్శకుడిగా మారి, కోకిల చిత్రంలో శోభను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రం నిర్మాణ సమయంలోనే బాలు మహేంద్ర, శోభల మధ్య మానసిక సాన్నిహిత్యం పెరిగింది. ఆయన ఆమెను అమ్ము అని పిలుస్తూ, ఆమె నటి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేశారు. క్రమంగా ఈ సాన్నిహిత్యం ప్రేమగా మారింది.

వారి సంబంధంపై రకరకాల వార్తలు రావడంతో, శోభ తల్లి ప్రేమ కుమార్తెను నిలదీసింది. అయితే అప్పటికే బాలు మహేంద్ర ప్రేమలో మునిగిపోయిన శోభకు ఆ హెచ్చరికలు పట్టలేదు. 1980లో తిరుచునాపల్లి సమీపంలో ఒక చిత్ర షూటింగ్ సమయంలో శోభ బాలు మహేంద్రకు పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయగా, అక్కడి గుడిలో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారు. అప్పటికే వివాహితుడైన బాలు మహేంద్రను తన కూతురు పెళ్లి చేసుకోవడం చూసి తల్లి ప్రేమ తట్టుకోలేకపోయింది. బాలు మహేంద్ర కట్టిన తాళిని తెంచేసి, ఆయనను తీవ్రంగా తిట్టి శపించింది. పెళ్లి తర్వాత కే.కే. నగర్‌లో బాలు మహేంద్రతో కాపురం మొదలుపెట్టినా, ఆయన తన మొదటి భార్య అఖిల, పిల్లల విషయాలను కూడా పట్టించుకోవడం శోభకు నచ్చేది కాదు. ఆయన తనతోనే ఉండాలని కోరుకునేది. దీనివల్ల వారిద్దరి మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు వచ్చేవి. తల్లి ఆదరణ కోల్పోవడం, భర్తతో సమస్యలు శోభను మానసికంగా కృంగదీశాయి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, 1980 ఏప్రిల్ 30 మధ్యాహ్నం 3 గంటలకు ఆమె ఇంట్లో మంచం పక్కనే నేల మీద మృతదేహమై కనిపించింది. మంచం పక్కనే ఆంగ్లంలో “అంకుల్, దయచేసి నన్ను క్షమించు. నా చావుకి ఎవరూ కారణం కాదు” అని రాసి ఉన్న ఒక లేఖను పోలీసులు కనుగొన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలో శోభ మెడపై ఉరి వేసుకున్నట్లు నల్లని చారిక ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, ఆమె ఉరి వేసుకుంటే, ఆమెను కిందకు ఎవరు దించారు అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.

శోభ తల్లి ప్రేమ తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, హత్య చేశారని అనుమానించి, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని అప్పటి భారత ప్రధానికి, తమిళనాడు గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. బాలు మహేంద్ర హంతకుడని ఆరోపించడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, తగిన ఆధారాలు లభించకపోవడంతో ఆయనను విడుదల చేశారు. శోభ మరణించే సమయానికి 12 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఆమె చివరిసారిగా ఏప్రిల్ 27న తన భర్త బాలు మహేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఒక తమిళ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సంఘటన జరిగిన చాలా కాలానికి, 1998లో బాలు మహేంద్ర మౌనికను రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల తర్వాత కానీ ఈ విషయం బయటపడలేదు. నటి శోభ మరణం మాత్రం ఇప్పటికీ ఒక అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Sirivennela Sitaramasastri : మనిషి జీవితంలో ఎదగటానికి ఈ లక్షణాలు ఉంటే చాలు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి..

ఎక్కువ మంది చదివినవి : Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

Follow Us