
అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ లో మొదటి వరసలో ఉండే పేరు రంభ. ఒకప్పుడు ఆమె ఇండస్ట్రీని ఊపేసింది. అందం అభినయంతో ఉర్రుతలూగించిన రంభ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రంభ గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. సినీ రంగంలో తనకు ఎదురైన అనుభవాలు, తన అభిమాన నటులు, పెళ్లి విశేషాల గురించి తెలిపారు రంభ. ఆమె మాట్లాడుతూ.. చిరంజీవి గారితో కలిసి తొలిసారి నటించినప్పుడు తనకు చాలా ఇన్ఫాట్యుయేషన్ ఉండేదని రంభ గుర్తుచేసుకున్నారు. ఆయన అంటే చాలా ఇష్టం.. ఆయన ముందు నిలబడాలన్నా, మాట్లాడాలన్నా చాలా సిగ్గుపడేదాన్నని, అసలు మాట్లాడేదాన్నే కాదని ఆమె పేర్కొన్నారు.
హిట్లర్ చిత్రంలోని అబ్బబ్బీ పాట చిత్రీకరణ సమయంలో చిక్ మంగళూర్ లో ఉన్నప్పుడు, అందరూ తన గురించి చిరంజీవికి చెప్పిన తర్వాతనే తాను ధైర్యం చేసి తన అభిమానాన్ని చిరంజీవిగారికి వ్యక్తం చేశానని తెలిపారు రంభ. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అంటే ఇప్పటికీ తనకు చాలా ఇష్టమని, ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించాలని కోరుకుంటున్నానని రంభ వెల్లడించారు. ఒక కోకా-కోలా యాడ్ మిస్ అవ్వడం వల్ల షారుఖ్ ఖాన్‌తో పనిచేసే అవకాశం కోల్పోయానని ఆమె చెప్పారు.
సినీ పరిశ్రమలో తనకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయని, అయితే ఆ రహస్యాలను బయటపెట్టలేనని, వారంతా ఇప్పుడు స్థిరపడ్డారని రంభ తెలిపారు. తన మాతృభాష తెలుగు అని, తన తొలి చిత్రం సర్గం తన కెరీర్‌లో ఒక మలుపు అని రంభ చెప్పారు. తన వివాహం గురించి ప్రస్తావిస్తూ, తన తల్లి చిన్నతనంలో తన పెళ్లి తిరుపతిలో జరగాలని మొక్కుకున్నారని, ఆ మొక్కును తీర్చడానికే తన వివాహం తిరుపతిలో సాంప్రదాయబద్ధంగా జరిగిందని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి కూడా తన పెళ్లికి వచ్చి మా ఇంటి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారని ఆమె గుర్తుచేసుకున్నారు రంభ..