
తెలుగు చిత్రసీమలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించిన నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో అందాలభామ పుష్పవల్లి ఒకరు. ఆమె జీవితం, కళ పట్ల నిబద్ధత, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల ఇలా చాలానే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని పెంటపాడులో ఒక దేవదాసి కుటుంబంలో పుట్టిన పుష్పవల్లి, తల్లిదండ్రులు కందాళ తాతాచార్యులు, రామలక్ష్మిలకు చాలా మంది పిల్లలు పుట్టి మరణించిన తర్వాత, ఆమె ఒక్కరే మిగిలారు. ఈ కారణంగా పుష్పవల్లిని వారు అల్లారుముద్దుగా పెంచారు. చిన్నతనంలోనే సినిమా పోస్టర్లను చూసి, సినిమాల పట్ల విపరీతమైన ఆసక్తిని పెంచుకున్నారు పుష్పవల్లి. అనంతరామ్ అనే బంధువు ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం జరిగింది. రాజమండ్రిలోని దుర్గాటోన్ స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న సంపూర్ణ రామాయణం చిత్రంలో బాల సీత పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఈ చిత్రం తర్వాత, దశావతారాలు, మోహిని భస్మాసుర వంటి చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు సి. పుల్లయ్య ఆమె ప్రతిభను గుర్తించి, మూడు సంవత్సరాల పాటు నెలకు 250 రూపాయల వేతనంతో ఒప్పందం చేసుకున్నారు. ఆయన దర్శకత్వంలోనే వరవిక్రయం, మాలతీ మాధవీయం వంటి చిత్రాలలో నటించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. వరవిక్రయం చిత్రంలో భానుమతి అక్క పాత్రలో నటించారు.
పుష్పవల్లి వృత్తి జీవితం ఎంత ఉన్నతస్థాయిలో సాగిందో, ఆమె వ్యక్తిగత జీవితం అంతే సంక్లిష్టంగా, సవాళ్లతో నిండిపోయింది. ముఖ్యంగా, సినీ నటుడు జెమినీ గణేషన్‌తో ఆమెకు ఏర్పడిన బంధం ఆమె జీవితంలో అనేక మలుపులకు కారణమైంది. పుష్పవల్లికి రంగాచారి అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా వీరు విడిపోయారు. ఆ తర్వాత అప్పటికే వివాహితుడైన జెమినీ గణేషన్‌తో సహజీవనం చేయడం ఆమె తొందరపాటు నిర్ణయాలలో ఒకటిగా చెప్తుంటారు. పుష్పవల్లికి జెమినీ గణేశన్ కు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారే రేఖ, రాధ. ఆతర్వాత జెమిని గణేశన్ సావిత్రిని పెళ్లి చేసుకోవడంతో పుష్పవల్లిని వదిలేశారు.
సావిత్రి జీవితంతో పోలికలు ఉన్నప్పటికీ, పుష్పవల్లి తన నిర్ణయాల వల్ల తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొన్నారని చెబుతారు. ఆతర్వాత ఓ నిర్మాతతో రిలేషన్ షిప్ లో ఉన్నారు పుష్పవల్లి.. కుమార్తెలు రేఖ, రాధలతో కలిసి ఆమె చాలా కష్టాలను అనుభవించారు. మొదట, పిల్లలకు సినిమా అవకాశాల కోసం ఆమె చేసిన ప్రయత్నాలు, ఆ తర్వాత రేఖ సినీ రంగ ప్రవేశం, బి.ఎన్. రెడ్డి రంగుల రాట్నం చిత్రంలో రేఖకు అవకాశం, అంజలి పిక్చర్స్ అమ్మ కోసం వంటి చిత్రాలలో ఆమె నటన ఇవన్నీ పుష్పవల్లి తల్లిగా పడిన శ్రమకు నిదర్శనం. రేఖ బాలీవుడ్‌లో స్థిరపడిన తర్వాత తన తల్లి, చెల్లెళ్లకు ఆసరా అయ్యారు. పుష్పవల్లి తన చివరి రోజులలో డయాబెటిస్‌తో బాధపడి, 1994లో డయాబెటిక్ కోమాలోకి వెళ్లి మరణించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి