
బలగం సినిమాతో అద్భుతమైన గుర్తింపు పొందిన నటుడు మురళీధర్ గౌడ్. ఆ తర్వాత ఆయన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్, మాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో అద్భుతంగా నటించారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ మెప్పించారు మురళీధర్ గౌడ్. గతంలో మురళీధర్ గౌడ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వచ్చిందా అని యాంకర్ ప్రశ్నించగా.. ఇటీవల పవన్ కళ్యాణ్ సినిమా అవకాశంతో పాటు తన సినీ ప్రయాణం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చిత్రంలో నటించే అవకాశం రావడం నిజమేనని, అయితే తన పాత్రకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు షూటింగ్ కు కూడా హాజరైన తర్వాత, దర్శకుడు హరీష్ శంకర్ ఆయన పాత్రను మార్చేశారని మురళీధర్ గౌడ్ వివరించారు.
అయితే, తన పాత్ర మార్చినందుకు నిరాశ చెందలేదు అని అన్నారు. పెద్ద బ్యానర్, పెద్ద స్టార్, పెద్ద డైరెక్టర్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం తన కెరీర్‌కు ఒక గొప్ప మెట్టు అని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోనూ తాను ఒక జడ్జి పాత్రలో కొన్ని సెకన్ల పాటు మూడు సార్లు కనిపించానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలో పూర్తిస్థాయి క్యారెక్టర్‌లో దాదాపు 20 నుండి 30 రోజుల పాటు ప్రయాణం చేయాలని ఆశించానని, అందుకే ఆ విషయం గురించి ముందే పంచుకున్నానని ఆయన అన్నారు. హరీష్ శంకర్ చూపించిన ఆదరణకు కృతజ్ఞతలు తెలిపారు.
సెట్‌లో పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడే అవకాశం లభించలేదని, అయితే ఆయనకు నమస్కారం చేసే అవకాశం దొరికిందని మురళీధర్ గౌడ్ పేర్కొన్నారు. తన స్థాయిని, పరిమితులను తాను ఎప్పుడూ గుర్తుంచుకుంటానని, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా దూరం పాటిస్తానని చెప్పారు. ఇండస్ట్రీలో అందరు హీరోలంటే తనకు ఇష్టమని, అందరితోనూ పనిచేయాలని ఉందని ఆయన తెలిపారు. చిన్న దర్శకులైనా, పెద్ద దర్శకులైనా, ఏ సినిమా అయినా సరే, పాత్ర తనకు సరిపోతుందని దర్శకుడు భావిస్తే ఆ పాత్రను అద్భుతంగా చేయడానికి తాను సిద్ధంగా ఉంటానని అన్నారు. దర్శకులను సంతృప్తి పరచడమే తన లక్ష్యమని మురళీధర్ గౌడ్ అన్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..