
వయసు పెరిగేకొద్దీ మనిషిలో ఉత్సాహం తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 70 శాతం మంది మోకాళ్ల నొప్పులతో నానా అవస్థలు పడుతుంటారు. కీళ్లలో లూబ్రికేషన్ తగ్గడం, కండరాలు బలహీనపడటంతో నడవడమే ఒక యుద్ధంలా మారుతుంది. అయితే, మన టాలీవుడ్‌కు చెందిన ఒక సీనియర్ స్టార్ నటుడు మాత్రం “వయసు అనేది మనసుకే కానీ శరీరానికి కాదు” అని నిరూపించారు. 85 ఏళ్ల వయసులో మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతూ కూర్చోకుండా.. మొండి పట్టుదలతో జిమ్‌లో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఎవరా సీనియర్ నటుడు? ఆయన ఎలా కోలుకున్నారో తెలుసా?
ఆయన మరెవరో కాదు.. మురళీ మోహన్! వెండితెరపై ఎన్నో హుందైన పాత్రలు పోషించిన మురళీ మోహన్ తన 85వ ఏట తన ఫిట్‌నెస్‌తో యువతకు సవాల్ విసురుతున్నారు. గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న ఆయన, వాటిని తగ్గించుకోవడానికి ఎంచుకున్న మార్గం అందరినీ ఆకట్టుకుంటోంది. సాధారణంగా ఈ వయసులో సర్జరీ లేదా విశ్రాంతి కోరుకుంటారు, కానీ మురళీ మోహన్ మాత్రం సైన్స్ ఆధారిత వ్యాయామాలను నమ్మారు.
టొనాబోలిక్ కోచ్ సౌమ్యదీప్ పర్యవేక్షణలో మురళీ మోహన్ గత రెండు నెలలుగా విశ్రాంతి లేకుండా శ్రమించారు. ఆయన చేసిన కొన్ని ప్రత్యేక వర్కవుట్స్ వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందారు. వెనక్కి నడవటం ద్వారా మోకాళ్లపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం బ్యాక్‌వర్డ్ వాక్స్, హిప్, మోకాలు మరియు చీలమండల కదలికల కోసం ప్రత్యేక డ్రిల్స్ జాయింట్ మొబిలిటీ, ముఖ్యంగా గ్లూట్స్, లెగ్ అబ్డక్టర్స్ మరియు టిబియాలిస్ యాంటీరియర్ కండరాలను బలోపేతం చేసే మజిల్ స్ట్రెంగ్తనింగ్ వ్యాయామాలు ఆయన కోలుకోడానికి బాగా ఉపయోగపడ్డాయి.
ఎలాంటి సాకులు చెప్పకుండా, ప్రతి వారం క్రమం తప్పకుండా జిమ్‌కు హాజరైన మురళీ మోహన్ కేవలం రెండు నెలల్లోనే మోకాళ్ల నొప్పుల నుంచి విముక్తి పొందారు. నొప్పి లేకుండా నడవగలను అనే స్థితి నుంచి జిమ్‌లో కష్టపడగలను అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. ఆయన పట్టుదల చూస్తుంటే.. వయసు అయిపోయిందని కుర్చీకే పరిమితమయ్యే వారికి ఒక గట్టి సందేశం ఇచ్చినట్లయింది.
Murali Mohan
“వయసును నిందించకండి.. కష్టపడటానికి సిద్ధపడండి” అని మురళీ మోహన్ నిరూపించారు. 85 ఏళ్ల వయసులో ఆయన చూపిస్తున్న ఈ ఉత్సాహం నిజంగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంతో, మరింత దృఢంగా మళ్ళీ షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. హ్యాట్సాఫ్ టు మురళీ మోహన్!