1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..

1989 సంవత్సరం టాలీవుడ్ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచింది. కేవలం 9 నెలల్లో చిరంజీవి ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’, నాగార్జున ‘శివ’ చిత్రాలు వరుసగా ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి అరుదైన రికార్డు సృష్టించాయి. పూర్తి వివరాలు కథనం లోపల ...

1989లో జరిగిన అద్భుతం.. టాలీవుడ్ చరిత్రలో చెరిగిపోని సువర్ణాధ్యాయం..
Industry Hits

Edited By:

Updated on: Apr 27, 2026 | 10:14 PM

తెలుగు సినీ చరిత్రలో కొన్ని రికార్డులు ఎప్పటికీ చెరిగిపోవు.. కొన్ని అద్భుతాలు మళ్లీ మళ్లీ జరగవు. అలాంటి ఒక రేర్ అండ్ క్రేజీ ఫీట్‌కు కేరాఫ్ అడ్రస్ 1989వ సంవత్సరం. టాలీవుడ్ పాలిట ఈ ఏడాదిని ‘గోల్డెన్ ఇయర్’ అని కచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే కేవలం 9 నెలల వ్యవధిలోనే ముగ్గురు అగ్ర హీరోలు నటించిన మూడు సినిమాలు ఒకదాని రికార్డులను మరొకటి క్రాస్ చేస్తూ ఏకంగా ‘ఇండస్ట్రీ హిట్స్’గా నిలవడం బహుశా ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎక్కడా జరిగి ఉండదు. అప్పట్లో దీని గురించి చర్చ కూడా బాగా జరిగింది. 1989 తర్వాత తెలుగు సినిమా స్థాయి ఇండియన్ సినిమాలో మరింత పెరిగింది. మన మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. దాన్ని మెయింటేన్ చేస్తూ ఆ తర్వాత మరిన్ని పెద్ద సినిమాలు కూడా వచ్చాయి. టాలీవుడ్‌లో అంతకు ముందు, ఆ తర్వాత కూడా కనీవినీ ఎరుగని ఈ బాక్సాఫీస్ విన్యాసం గురించి ఇప్పటి తరానికి కచ్చితంగా తెలియాల్సిందే.

ఈ రికార్డుల పరంపరకు శ్రీకారం చుట్టింది మెగాస్టార్ చిరంజీవి. 1989 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతాఇంతా కాదు. తెలుగునాట ‘అత్త-అల్లుళ్ల’ సవాల్ అనే ట్రెండ్‌కు పర్ఫెక్ట్ బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ సినిమా.. ఫస్ట్ టైమ్ 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడి అప్పటివరకు ఉన్న కలెక్షన్ల రికార్డులను తిరగరాసి సరికొత్త ‘ఇండస్ట్రీ హిట్’గా అవతరించింది. విజయశాంతి గ్లామర్, చిరు డ్యాన్సులు, చక్రవర్తి సంగీతం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి. మెగాస్టార్ సెట్ చేసిన ఈ రికార్డు కేవలం 4 నెలలు మాత్రమే పదిలంగా ఉంది. అదే ఏడాది ఏప్రిల్ 7వ తేదీన నందమూరి బాలకృష్ణ నటించిన ‘ముద్దుల మావయ్య’ థియేటర్లలోకి వచ్చి కాసుల వర్షం కురిపించింది.

కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌కు తోడు బాలయ్య మాస్ అప్పీల్ తోడవ్వడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 28 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. చిరంజీవి సినిమా నెలకొల్పిన వసూళ్ల రికార్డులను పటాపంచలు చేసింది. నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ ఆ ఏడాదికి రెండో ఇండస్ట్రీ హిట్‌గా చరిత్రకెక్కింది. బాలకృష్ణ రికార్డుల మోతతో ఇక 1989 బాక్సాఫీస్ విన్నర్ ఆయనే అని అంతా ఫిక్స్ అవుతున్న సమయంలో.. సరిగ్గా ఆరు నెలల గ్యాప్‌లో కింగ్ నాగార్జున ‘శివ’ రూపంలో అక్టోబర్ 5న థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చాడు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయమవుతూ తీసిన ఈ చిత్రం తెలుగు సినిమా గతిని, మేకింగ్ స్టైల్‌ను సమూలంగా మార్చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన శివ చిత్రం 22 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శితమైంది.

ఆ తర్వాత ఓ జనరేషన్‌కు ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. అప్పటిదాకా ‘ముద్దుల మావయ్య’ పేరిట ఉన్న హైయెస్ట్ షేర్స్ రికార్డును క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, టేకింగ్ టాలీవుడ్‌కు కొత్త కావడంతో ఈ మూవీ ముచ్చటగా మూడో ఇండస్ట్రీ హిట్‌గా రికార్డులకెక్కింది. ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్‌లో.. అది కూడా 9 నెలల వ్యవధిలో 3 ఇండస్ట్రీ హిట్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ మూడు సినిమాలు మూడు విభిన్నమైన జానర్స్‌లో తెరకెక్కినవి. ఒకటి పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాగా, రెండోది ఎమోషనల్ యాక్షన్ డ్రామా, మూడోది కాలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో వచ్చిన టెక్నికల్ వండర్. ముగ్గురు బడా స్టార్లు తమదైన స్టైల్‌లో బాక్సాఫీస్ రికార్డులతో చెలగాటమాడిన 1989వ సంవత్సరం.. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలకు, సినిమా అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతమైన సువర్ణ అక్షరాల అధ్యాయం.

ఎంతో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన మెరుపు మూవీ 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా..?

Follow Us