18 Pages Review: 18 పేజెస్ రివ్యూ.. ఎలాంటి అసభ్యత లేని అందమైన ప్రేమకథ..
కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడంతో 18 పేజెస్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పైగా గీతా ఆర్ట్స్ నిర్మాణం.. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడం కూడా దీనిపై అంచనాలు పెంచేసాయి. మరి 18 పేజెస్ ఎలా ఉంది
మూవీరివ్యూ: 18 పేజెస్
నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్, దినేష్ తేజ్, అజయ్, పోసాని కృష్ణమురళి, సరయు, తదితరులు
సంగీతం: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: ఏ వసంత్
నిర్మాత: బన్నీ వాస్
బ్యానర్లు: జి ఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్
కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్
దర్శకత్వం: సూర్య ప్రతాప్ పల్నాటి
విడుదల తేది: 23/12/2022
కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ తర్వాత నిఖిల్ నటించిన సినిమా కావడంతో 18 పేజెస్‌పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. పైగా గీతా ఆర్ట్స్ నిర్మాణం.. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడం కూడా దీనిపై అంచనాలు పెంచేసాయి. మరి 18 పేజెస్ ఎలా ఉంది.. నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జోడీ మరో విజయం అందుకుందా లేదా అనేది చూద్దాం..
కథ:
సిద్ధూ (నిఖిల్) (నిఖిల్) ఒక యాప్ డెవలపర్. తన స్నేహితురాలు భాగీ (సరయు)తో కోలిసి ఓ యాప్ డెవలప్ చేస్తుంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. ఆ బాధతో ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద పడిపోయినపుడు సిద్ధూకు ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ రాసిన అమ్మాయి పేరు నందిని (అనుపమ పరమేశ్వరన్). ఆమె ఎవరో ఏంటో తెలియకుండానే.. నందిని ఆలోచనలతో ప్రేమలో పడిపోతాడు సిద్ధూ. ఆ డైరీలో ఒక్కో పేజీ చదువుతూ పూర్తిగా నందిని ఆలోచనలన్నీ ఈయనవి అయిపోతాయి. ఎలాగైనా ఆమెను కలవాలని ఆమె ఊరు కూడా వెళతాడు. కానీ అక్కడామె ఉ:డదు.. హైదరాబాద్ వచ్చి వెతికినా కూడా దొరకదు. అదే సమయంలో నందిని ఓ యాక్సిడెంట్‌లో చనిపోయిందని తెలుసుకుంటాడు సిద్ధూ. అప్పుడేం జరిగింది.. అసలు నందిని ఎలా చనిపోయింది.. దీనికి ముగింపు ఏంటి అనేది అసలు కథ..
కథనం:
ఏడేళ్ళ కింద సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించిన కుమారి 21 ఎఫ్ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు అందుకున్నాడు పల్నాటి సూర్యప్రతాప్. అప్పుడు కాస్త హద్దులు దాటి.. బోల్డ్ ప్రేమకథను చూపించారు ఈ గురుశిష్యులు. కానీ ఈ సారి మాత్రం అలా కాదు.. స్వచ్ఛమైన ప్రేమను పరిచయం చేయాలనుకున్నారు. ప్రేమంటే రొమాన్స్ చేసుకోవడం, డ్యూయెట్లు పాడుకోవడం మాత్రమే కాదు. మనిషిని చూడకుండా.. మనసుతో మాయలో పడిపోవడం కూడా ప్రేమే. ఆ మధ్య సీతారామంలో ఇదే చూపించారు.. 18 పేజెస్‌లోనూ అదే చెప్పారు. ప్రేమించడానికి కారణం ఉండకూడదనే ఒక్క కాన్సెప్టుతో కథ రాసాడు సుకుమార్. గురువు రాసిన కథను తూచా తప్పకుండా స్క్రీన్ మీద చూపించాడు పల్నాటి సూర్యప్రతాప్. ఎవరో తెలియని అమ్మాయి.. ఆమె డైరీ చదువుతూ హీరో ప్రేమలో పడటం.. ఆమె ఆలోచనలతో కనెక్ట్ అయిపోవడం.. ఆమె కోసం ఎంతదూరమైనా వెళ్లడం.. అంతలోనే ఆమె గురించి భయంకరమైన నిజం తెలియడం.. ఇలా ప్రతీది చాలా ఎమోషనల్‌గా చూపించాడు దర్శకుడు సూర్యప్రతాప్. అక్కడక్కడా కాస్త స్లో నెరేషన్ ఇబ్బంది పెట్టినా.. ఫ్రెష్‌గా అనిపిస్తుంది 18 పేజెస్. ముఖ్యంగా క్లైమాక్స్ బాగుంది.. రొటీన్‌గా కాకుండా చాలా కొత్తగా అనిపించింది. సినిమా అంతా హీరో హీరోయిన్లు కలవకుండా ఉండటం.. కనీసం ఒకరినొకరు చూసుకోకుండా ఉండేలా కథ చెప్పడం చాలా కష్టం. కానీ ఆ ఫీల్ రాకుండా అందంగా రాసుకున్న స్క్రీన్ ప్లే 18 పేజెస్‌కు బలం. సుకుమార్ స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. అనుపమ పరమేశ్వరన్ కారెక్టరైజేషన్ బాగుంది. ఇలాంటి సినిమాలకు క్లైమాక్స్ చాలా ముఖ్యం. ఏ మాత్రం తేడా కొట్టినా ముందు నుంచి ఉన్న ఫీల్ పోతుంది. దాన్ని పోకుండా చూసుకున్నాడు దర్శకుడు సూర్యప్రతాప్. ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చి.. ప్రేమంటే కలిసి ఒకేచోట ఉండటం.. చూడకుండా కూడా రెండు మనసులు ప్రేమలో పడతాయని చూపించాడు. ఓవరాల్‌గా 18 పేజెస్.. ఫ్రెష్ అండ్ ప్యూర్ లవ్ స్టోరీ.. ఓసారి చూడొచ్చు..
నటీనటులు:
నిఖిల్ మరోసారి ఆకట్టుకున్నాడు. ఆయన నటన చాలా బాగుంది. స్క్రీన్ మీద మెచ్యూర్డ్‌గా కనిపించాడు నిఖిల్. అనుపమ పరమేశ్వరన్ ఎప్పట్లాగే న్యాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. ఆమె పాత్రను మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. 7 ఆర్ట్స్ సరయు డైలాగ్స్ బాగున్నాయి.. ఎంటర్‌టైనింగ్‌గా అనిపించాయి. సినిమాలో కామెడీ ఎపిసోడ్ అంతా సింగిల్ హ్యాండ్‌తో కవర్ చేసింది సరయు. దినేష్ తేజ్ మరో కీలక పాత్రలో బాగున్నాడు. పోసాని, అజయ్ అంతా తమకున్నంతలో బాగున్నారు.
టెక్నికల్ టీం:
గోపీసుందర్ మ్యూజిక్ బాగుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ బలం.. అలాగే పాటలు కూడా ఆకట్టుకుంటాయి. వసంత్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ కూడా పర్లేదు. రైటింగ్ సైడ్ వస్తే సుకుమార్ మరోసారి తన విలక్షణత చూపించాడు. ముఖ్యంగా మనసులు కలవాలి కానీ మనుషులు కాదు ప్రేమకు అనేది బాగా చూపించాడు. సూర్యప్రతాప్ స్టోరీ డీల్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా 18 పేజెస్ చాలా ఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన బలం. బన్నీ వాసు మరోసారి ఖర్చుకు వెనకాడలేదు.
పంచ్ లైన్:
18 పేజెస్.. ఎలాంటి అసభ్యత లేని అందమైన ప్రేమకథ..