ఈ ఏడాది చివరికి వచ్చేసింది. ప్రతీ వారం మాదిరిగానే ఈ వీక్ కూడా చాలానే చిత్రాలు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. థియేటర్లలో వరుసపెట్టి సినిమాలు విడుదలవుతున్నప్పటికీ.. ఓ వర్గం ప్రేక్షకులు ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్, వినూత్న వెబ్‌సిరీస్‌లు, సరికొత్త సినిమాలను ఓటీటీలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం ఓటీటీల్లో ఈ వీకెండ్ తప్పక చూడాల్సిన చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈ మధ్యకాలంలో కంటెంట్ ఉన్న చిత్రాలు అటు థియేటర్లు, ఇటు ఓటీటీల్లో ఎక్కడ రిలీజ్ అయినా కూడా ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆ కోవకు చెందినదే ‘జయ జయ జయ జయహే’. ఈ మలయాళీ సినిమా.. చిన్న చిత్రంగా థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం డిస్నీ+ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. గృహహింస నేపధ్యంలో.. భర్త వేధింపులకు ఎదురుతిరిగే ఓ అమ్మాయి కథను ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా.. కాస్త వినోదాన్ని జత చూసి దర్శకుడు విపిన్ దాస్ ఈ సినిమాను తెరకెక్కించాడు.
‘కోమలి’ ఫేం ప్రదీప్ రంగనాధన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్ టుడే’. ఇందులో ప్రదీప్‌కు జోడిగా ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకునే సబ్జెక్ట్‌తో.. ఈతరం లవ్‌స్టోరీని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రం తమిళనాట నవంబర్ 4వ తేదీన విడుదల కాగా.. తెలుగులో నిర్మాత దిల్ రాజు నవంబర్ 25వ తేదీన రిలీజ్ చేశారు. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అదిరిపోయే వసూళ్లతో దూసుకుపోయింది. ఇక ఈ చిత్రం డిసెంబర్ 23 నుంచి తెలుగు ఆడియోతో నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.
అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం‘. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే ఓ ఎన్నికల అధికారి రోల్‌ను నరేష్ పోషించాడు. ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది గానీ.. కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 వేదికగా డిసెంబర్ 23వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన తాజాగా చిత్రం ‘గట్ట కుస్తీ’. తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో డబ్ అయింది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి చెళ్ల అయ్యవు దర్శకుడు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించింది గానీ.. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. ఇక జనవరి 1వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.
విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘DSP’. ఈ యాక్షన్ కామెడీ డ్రామాకు పొన్ రామ్ దర్శకుడు. ఇందులో అనుక్రీతి వాస్ హీరోయిన్ కాగా.. డి.ఇమ్మాన్ సంగీతం అందించాడు. డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఓటీటీ ఫ్యాన్స్‌ను అలరించేందుకు వచ్చేస్తోంది. డిసెంబర్ 30వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది.
అమలాపాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ది టీచర్’. దీనికి వివేక్ దర్శకుడు. తన జీవితాన్ని నాశనం చేసిన నలుగురు స్టూడెంట్స్‌కి ఓ టీచర్ ఎలాంటి గుణపాఠం చెప్పిందన్నది ఈ చిత్ర కథాంశం. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఒక సెన్సిటివ్ సమస్య చుట్టూ కథను సీరియస్‌గా తీసుకెళ్లాడు దర్శకుడు. ఇందులో అమలాపాల్ నటన ఆకట్టుకుంటుంది.
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బటర్ ఫ్లై’. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్‌లో డిసెంబర్ 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. మిస్టరీ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ మూవీ కథ పిల్లల కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో భూమికా చావ్లా, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు.