
తమిళ స్టార్, టీవీకే అధినేత విజయ్ దంపతుల విడాకుల వ్యవహారం గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య సంగీత వేసిన విడాకుల పిటిషన్‌పై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. అయితే ఇప్పుడీ వ్యవహారం కేవలం న్యాయపరమైన అంశంగానే కాకుండా సెటిల్‌మెంట్ చుట్టూ తిరుగుతోంది. ప్రధానంగా ఆస్తుల పంపకం, భరణం విషయంలో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. విజయ్ తన ఎన్నికల నామినేషన్ పత్రాల్లో పేర్కొన్న ఆస్తి వివరాలను ప్రాతిపదికగా తీసుకుని, సంగీత సుమారు రూ.250 కోట్ల సెటిల్‌మెంట్ కోరినట్లు సమాచారం. కేవలం తన కోసమే కాకుండా కొడుకు, కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే విడాకుల ప్రక్రియ ముగిసే వరకు చెన్నై నీలాంగరైలోని విజయ్ నివాసంలోనే ఉండేందుకు అనుమతించాలని ఆమె మధ్యంతర పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.
మరోవైపు విజయ్ తరఫు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన సంగీతకు రూ.35 కోట్లు సెటిల్‌మెంట్‌గా ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. పిల్లల బాధ్యతను తానే చూసుకుంటానని, వారికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తానని ఆయన స్పష్టం చేసినట్లు కోలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. శనివారం ఇరు వైపుల లాయర్లతో జరిగిన చర్చల్లో ఈ ఆర్థికాంశాలపైనే ప్రధానంగా కసరత్తు జరిగినట్లు సమాచారం.
చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతానని విజయ్ కోరగా.. కోర్టు అందుకు నిరాకరించింది. జూన్ 15న విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. విడాకుల ప్రక్రియ ముగిసే వరకు చెన్నై నీలాంగరైలోని విజయ్ నివాసంలోనే ఉండేందుకు అనుమతించాలని కోరుతూ సంగీత దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌పై కూడా అదే రోజు విచారణ జరగనుంది.