బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ రియాలిటీ షోలో చాలా తతంగం ఉంటుంది. కంటెస్టెంట్స్ ఎంపికకు కూడా చాలా దశలుంటాయి. ఫోన్ కాల్స్.. వీడియో ఇంటర్వ్యూ.. డైరెక్ట్ ఇంటర్వ్యూలు.. ఇలా పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్‌లోకి పంపుతారు. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు వెళతారన్నది షో లాంఛింగ్ రోజున స్టేజ్ ఎక్కేవరకు కూడా క్లారిటీ రాదు. ఇక తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సీజన్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీల్లో ఏదో ఒకరోజు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ ప్రారంభం కావచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కంటెస్టెంట్స్ జాబితాలు కూడా నెట్టింట భారీగానే దర్శనమిస్తున్నాయి. అందులో విశాఖపట్నంకు చెందిన నటి, జనసేన నాయకురాలు రేఖా భోజ్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ఆశలపై బిగ్ బాస్ టీమ్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. గతంలో హౌస్ లోకి తెలుగు వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ గొంతెత్తింది రేఖ. దీంతో ఎనిమిదో సీజన్ కంటెస్టెంట్ గా ఈ వైజాగ్ బ్యూటీ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ఆశలు అడియాశలు అయ్యినట్లు సమాచారం.
బిగ్ బాస్ 8 ఇంటర్వ్యూ కంప్లీట్ చేసిన వాళ్లకి ఇటీవల అఫీషియల్‌గా కాల్స్ వచ్చాయట. సెలెక్ట్ అయిన వాళ్లకి ఎప్పుడు రావాలి? ఏం చేయాలి?తదితర వివరాలను బిగ్ బాస్ టీమ్ కంటెస్టెంట్స్ కు చెప్పారట. అదే సమయంలో సెలెక్ట్ కాని వాళ్లని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని అనేశారట. అలా రిజెక్ట్ అయిన లిస్ట్‌లో రేఖా భోజ్ పేరు కూడా ఉందట. ఈ విషయాన్ని డైరెక్ట్‌గా కాకుండా.. ఇన్ డైరెక్ట్‌గా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిందీ తెలుగు హీరోయిన్. ‘అఫీషియల్‌గా ఇప్పుడే తెలిసింది.. నాట్ ఫర్ దిస్ టైం అని. చాలా బాధగా ఉంది. కానీ ఇదే ముగింపు కాదు కదా. మళ్లీ ట్రై చేస్తాను. ఈ నిరాశ నుంచి కోలుకుని తిరిగి పోరాడే శక్తిని ఇవ్వు ఈశ్వరా.. ఒక నెల పాటు అందరికీ సెలవు’ అంటూ తన సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది రేఖా భోజ్. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇక రేఖా భోజ్ అసలు పేరు శ్రీ సుష్మ. మాంగళ్యం, దామిని విల్లా, రంగేలా, కళ్యాణ తస్మై నమ: తదితర సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం వైజాగ్ లోనే ఉంటూ కవర్ సాంగ్‌లు, వీడియో ఆల్బమ్స్ చేస్తూ నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ మధ్యన టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే విశాఖ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేసింది ఈ బ్యూటీనే. ఇక ఆమె పవన్ కల్యాణ్ కు వీరాభిమాని కూడా.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.