
అమ్మవారికి చీర పెట్టి సారె సమర్పించాలి అంటుంది భద్రావతి. ఈసారి మనం గుడికెళ్లొద్దు అక్కా అంటాడు అన్న. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్న ఆచారాన్ని వద్దంటావేంట్రా అంటే. ఆ కూలి వాడి కుటుంబం కూడా గుడికొస్తుంది.. ధీరజ్ నన్ను కొట్టాడని ఎగతాళి చేసి ఎక్స్‌ట్రాలు చేస్తారు అంటాడు. ధీరజ్ చేతిలో నాకు అవమానం జరిగితే నా కూతురు తట్టుకోలేదు అంటాడు. పర్వాలేదు వాళ్లు తిడితే పడదాం.. అవమానిస్తే భరిద్దాం కానీ ప్రేమ కోసం కచ్చితంగా గుడికెళదాం అంటుంది భద్రావతి. ప్రేమ మనసుకి ధీరజ్ చేసిన గాయం అంత త్వరగా మానదు. ప్రేమను మళ్లీ మామూలు మనిషిని చేద్దాం అంటుంది. తను గుడికి రానని ఇంపార్టెంట్ క్లాస్ ఉందని ప్రేమ అంటుంది. గుళ్లో ప్రేమ, ధీరజ్‌ను మాట్లాడుకునేలా చేసి వారి మధ్య అపార్థాలను దూరం చేయాలనుకుంటాడు విశ్వక్. ఇప్పుడు ప్రేమ రానంటోంది.. ఏం చేయాలి అన్న ఆలోచనలో పడతాడు.
రామరాజు ఇంటికి బ్యాగులు మోసుకుంటూ వస్తాడు. అత్తయ్య చేత్తో ఇస్తే కానీ కాఫీ తాగరు మావయ్య.. బయట భోజనం ఇంటికి తెచ్చుకుని తినడం చూస్తుంటే గుండె తరుక్కపోతోంది.. వల్లీ ఎగతాళి చేస్తుంది. భోజనం కాదమ్మా అమ్మవారికి చీరె తెచ్చాను అంటాడు రామరాజు. సమయం సందర్భం లేకుండా చీర ఎందుకు అంటుంది వేదవతి. కొంత మంది భర్తను మోసం చేసిన వారు ఇంటి సాంప్రదాయాన్ని మర్చిపోయారు అంటాడు రామరాజు. చిన్న కోడలు పుట్టింటికి వెళ్లింది. ప్రస్తుతం మనం పండగలు పబ్బాలు జరుపుకునేంత సంతోషంగా ఉన్నామా అని వేదవతి అంటుంది. కోడలు ఇవాళ కాకపోతే రేపయినా తిరిగొస్తుంది. అమ్మవారికి చీర పెట్టే అవకాశం ఏడాది తర్వాతే వస్తుంది అంటాడు రామరాజు. అమూల్యను పిలిచి ఇంట్లో మహాలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి గోల్డ్ చైన్ ఇస్తాడు. వేదవతి బాధగా చూస్తుంది. ఆయనేం తెచ్చినా ముందు నాకిస్తారు కానీ ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు అనుకుంటుంది.
తనకి గోల్డ్ చైన్ ఇవ్వబోతుంటే ఆశీర్వదించండి మావయ్య అని కాళ్ల మీద పడుతుంది వల్లి. అతి వినయం ధూర్త లక్షణం అంటే ఇదే అనుకుంటుంది నర్మద. నర్మదకు కూడా రామరాజు చైన్ ఇస్తాడు. నర్మద భర్త వారిస్తాడు. వాళ్ల వస్తువులు ఎందుకు తీసుకోవాలి తిరిగిచ్చెయ్ అంటాడు. అంత పౌరుషం ఉంటే ముందు తాకట్టు పెట్టిన పెళ్లాం నగలు తీసుకురా అంటాడు రామరాజు. ఈ చైన్ ప్రేమకు ఇవ్వు అని ధీరజ్‌కు ఇస్తాడు. నేను పలకరిస్తేనే మాట్లాడ్డం లేదు అలాంటిది చైన్ ఇస్తే తీసుకుంటుందా నాన్నా అంటాడు ధీరజ్. అమ్మవారికి చీర పెట్టడానికి రేపు వాళ్లు కూడా గుడికొస్తారు. గుళ్లో ప్రేమకి నచ్చజెప్పి చైన్ ఇవ్వు అంటాడు రామరాజు. అంతలో వల్లి చాలా అతి చేస్తుంది. నా మెళ్లో చైన్ వేయండి అని భర్తతో అంటుంది. ఏం నీకు చేతులు లేవా అంటాడు భర్త. ఎందుకు కసురుకుంటావు తన సంతోషం కోసం వేయి అని ఆర్డరేస్తాడు రామరాజు. వల్లి ఓవరాక్షన్ కి నర్మద, ధీరజ్, వేదవతి విసుక్కుంటారు.
ఇదిగో అమ్మకివ్వు అని అమూల్యకి చైన్ తీసిస్తాడు రామరాజు. నాకేం వద్దు నాతో మాట్లాడి నా మెడలో వేస్తానంటేనే తీసుకుంటాను అంటుంది వేదవతి. అది జరగదు జీవితాంతం బీరువాలో ఉంటుంది అంటాడు రామరాజు. అయితే రేపు గుడికి రాను అంటుంది వేదవతి. మీకో విషయం చెప్పాలి అత్తయ్యా అంటుంది నర్మద. ధీరజ్ నువ్వు కూడా రా అని రూమ్‌లోకి తీసుకెళుతుంది. ఏం మాట్లాడుకుంటున్నారా అని వల్లి చాటుగా వింటుంది. రేపు గుళ్ళో ప్రేమను పక్కకు తీసుకెళ్లి మాట్లాడదాం అత్తయ్యా. మీ అన్నయ్య మిమ్మల్ని దారుణంగా అవమానించిన విషయం ప్రేమకి తెలియదు.మీ అక్క, అన్నయ్య ఇంటికి వచ్చింది నిజంగా మీ అమ్మ పుట్టినరోజు జరిపించడానికి కాదు.. కావాలనే గొడవ పెట్టుకుని ప్రేమను తీసుకెళ్లిపోవాలనే. ఆ విషయాన్ని ప్రేమకి అర్థమయ్యేలా చెబుదాం అంటుంది నర్మద. దీనికి కర్త కర్మ క్రియ వల్లీ అంటుంది. చాటుగా వింటున్న వల్లి నా గురించి అంతా తెలిసిపోయిందని గుండెలు బాదుకుంటుంది. ఫుల్‌గా నా మీదే ఫోకస్ పెట్టారు దేవుడా.. ప్రేమకి వీళ్లు నిజాలు చెప్పకుండా స్పీడ్‌బ్రేకర్ వేయాలి అని ఆలోచనలో పడుతుంది.
విశ్వక్ అమూల్యకి ఫోన్ చేస్తాడు. ప్రేమ రేపు గుడికి రావడం లేదు అంటాడు. నువ్వేం చేస్తావో తెలియదు ప్రేమను తీసురావాలంతే అని తెగేసి చెప్తుంది అమూల్య. ప్రేమ ధీరజ్‌ని కలిపే అవకాశాన్ని మనం మిస్ చేసుకోకూడదు అంటుంది.మరుసటి రోజు గుడికి ముందే రెడీ అయి హాల్లో వెయిట్ చేస్తుంటాడు విశ్వక్. ప్రేమ ఎంతకీ కిందకి దిగి రాదేంటి? అనుకుంటాడు. అదే సస్పెన్స్‌తో ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.