మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ మసాలా మూవీ ఇది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి తో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ , పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వీరయ్య టైటిల్ సాంగ్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా నుంచి పూనకాలు లోడింగ్ అంటూ మరో పాటను రిలీజ్ చేశారు.
ఇటు మాస్ రాజా ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ కు నిజంగానే పూనకాలు తెప్పించేలా ఉంది ఈ పాట. వాల్తేరు వీరయ్య సినిమాకు దేవీశ్రీ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల ముందుగానే వారు న్యూ ఇయర్ గిఫ్ట్ ని అందించేశారు. అనౌన్స్ మెంట్ పోస్టరే పూనకాలు తెప్పించేసింది. అందులో చిరంజీవి, రవితేజ ఒకరినొకరు ఫెరోషియస్ గా చూస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్ లో జాతర వాతావరణం కనిపిస్తోంది. పోస్టర్ లో చిరంజీవి, రవితేజ కాంట్రాస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు. చిరు టైటిల్ రోల్ లో కనిపిస్తుండగా, రవితేజ పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. నాలుగో పాట ఇప్పటికే ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టి మెగా మాస్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కాబోతోంది.
ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ కు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.