‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో దక్కుతోన్న గౌరవం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది పాన్ ఇండియాగా విడుదలైన ఈ సినిమా పాన్ వరల్డ్ క్రేజ్‌ను దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ట్రిపులార్ చిత్రానికి అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న ట్రిపులార్‌కు మరిన్ని అవార్డులు దక్కిత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం నాలుగు పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ వేడుకకు హాజరైన చెర్రీ.. వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్ విభాగాలలో విజేతలను ప్రకటించారు. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును చరణ్, రాజమౌళి సంయుక్తంగా అందుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్‌ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ‘ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్, మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్’ను రామ్‌చరణ్ ద్వారా ప్రకటింపచేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్‌చరణ్‌కు, దర్శకుడు రాజమౌళికి, చిత్రబృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని పవన్ తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..