మూవీ రివ్యూ: విద్యా వాసుల అహం
నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు
సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్
సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి
ఎడిటింగ్: సత్య గిడుతూరి
దర్శకుడు: మణికాంత్ గెల్లి
నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట
ఈ మధ్య థియేటర్ సినిమాలతో పాటు ఓటిటిలోనూ వరసగా సినిమాలు వచ్చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలుగు ఓటీటీ ఆహాలో తాజాగా విద్యా వాసుల అహం అనే సినిమా వచ్చింది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్‌లు జంటగా నటించిన ఈ చిత్రం పెళ్లి నేపథ్యంలో వచ్చింది. మరి ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
విద్య (శివాని) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. వాసు (రాహుల్ విజయ్) మెకానికల్ ఇంజనీర్. ఈ ఇద్దరికి పెళ్లి మీద పెద్దగా ఆసక్తి ఉండదు. వాసు అయితే పెళ్లే చేసుకోకూడదని ఫిక్సైపోతారు. కానీ ఓసారి గుళ్ళో సీతారాముల గొప్పతనం గురించి అయ్యవారు చెప్పింది విన్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఆ సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్న వాళ్లకు విద్య ఓ ఫామ్ రెడీ చేసి ఇస్తుంది. అది చూసి.. అందులో మంచి మార్కులు వచ్చిన వాళ్లనే పెళ్లిచూపులకు పిలవాలని చెప్తుంది. అలా వచ్చిన వాడే వాసు. ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమించుకుంటారు.. పెళ్లి చేసుకుంటారు. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. పెళ్లి తర్వాత కొత్త కాపురం పెట్టి అంతా బాగా నడుస్తున్న సమయంలో హనీమూన్ కోసం భార్యను డబ్బులు అడుగుతాడు వాసు. అక్కడ చిన్న గొడవ మొదలవుతుంది. అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. అలా ఇద్దరి మధ్య పరస్పర గొడవలు జరుగుతూనే ఉంటాయి. అప్పుడు వాళ్లేం చేసారు.. ఇద్దరూ మళ్లీ ఎప్పుడు కలిసారు.. అనేది ఈ సినిమా కథ..
కథనం:
ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని ఎవర్‌గ్రీన్ సబ్జెక్ట్ పెళ్లి. అందుకే మన దర్శకులు మాట్లాడితే భార్యాభర్తల మీద సినిమాలు తీస్తుంటారు. కాస్త ఎంటర్‌టైనింగ్‌గా తీయాలి కానీ ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఎఫ్2 లాంటి సినిమాల్లో ఏ కథ లేకపోయినా కూడా అంత బాగా ఆడటానికి కారణం రిలేటబుల్‌గా ఉండే కథ, కథనాలు. విద్యా వాసుల అహం సినిమాలో దర్శకుడు మణికాంత్ చేసింది ఇదే. మరీ ఎంటర్‌టైనింగ్ కాదు కానీ బాబోయ్ అనుకునేలా మాత్రం ఉండదు. సింపుల్ అండ్ క్యూట్‌గా అలా వెళ్లిపోతుంది కథ. ఎక్కడా మనకు కొత్త కథ చూస్తున్నట్లు అనిపించదు.. కానీ తెలిసిన కథనే చాలా అందంగా తెరకెక్కించే ప్రయత్నం అయితే సిన్సియర్‌గా చేసాడు దర్శకుడు మణికాంత్. ఫస్టాఫ్ అంతా కొత్త పెళ్లిలో ఉండే మురిపాలు చూపించాడు. హీరో హీరోయిన్ మధ్య సాగే సన్నివేశాలు అన్నీ బాగున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ వాళ్లు కలిసినపుడు పెళ్లి చూపుల సీన్ ఫన్నీగా ఉంటుంది. ఇక హీరోయిన్ ఫామ్ ఇచ్చి ఫిల్ చేయమనే సీన్ కూడా సరదాగా అనిపిస్తుంది.. కొత్తగానూ ఉంటుంది. సెకండాఫ్ మాత్రం పెళ్లయ్యాక వచ్చే రియాలిటీ చూపించాడు దర్శకుడు. వద్దురా బాబోయ్ పెళ్లి అంటూ చాలా సినిమాలే వచ్చాయి.. చివర్లో మళ్లీ ఆ పెళ్లే ముద్దు అని చెప్తారు. విద్యా వాసుల అహం కూడా అంతే.. ఇద్దరి ఇగో కారణంగా గొడవలే ఈ సినిమా. చిన్న చిన్న మనస్పర్థలు వస్తుంటాయి పోతుంటాయి కానీ పెళ్లి అనే బంధం బలంగా ఉండాలనేది దర్శకుడు ఆలోచన. తీసుకున్న కథ సింపుల్‌గానే ఉన్నా.. తీసిన విధానం వినోదాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగానే కనెక్ట్ అవుతాయి. భార్య భర్తల మధ్య రిలేషన్ అనేది ఎంత బలంగా ఉండాలనేది సరదా సన్నివేశాలతోనే లోతుగా హత్తుకునేలా ప్రజెంట్ చేసాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే ఇంకాస్త ఫాస్టుగా ఉండుంటే కచ్చితంగా ఇంకా మంచి సినిమా అయ్యుండేది ఈ విద్యా వాసుల అహం.
నటీనటులు:
రాహుల్ విజయ్ అద్బుతంగా నటించాడు. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు. స్క్రీన్ మీద అప్పియరెన్స్ బాగుంది. డాన్సులు కూడా చాలా బాగా చేసాడు. ఇక శివానీ రాజశేఖర్ అయితే చాలా బాగా నటించింది. విజయ్‌తో పోటీ పడి మరీ నటించింది శివానీ. ఇద్దరి పెయిర్ కూడా చూడ్డానికి స్క్రీన్ మీద అందంగా ఉంది. అవసరాల శ్రీనివాస్, అభినయ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేసారు. రఘబాబు, కాశీ విశ్వనాథ్ సహా మిగిలిన వాళ్ళంతా తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ టీం:
కళ్యాణి మాలిక్ సంగీతం ఈ సినిమాకు ప్లస్. పాటలు కూడా ఆకట్టుకున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ ఓకే. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. కానీ దర్శకుడి ఛాయిస్ కాబట్టి ఎడిటర్‌ను తప్పు బట్టలేం. దర్శకుడు మణికాంత్ మంచి కథ రాసుకున్నాడు. దాన్ని తీయడం కూడా చాలా బాగా తీసాడు. కాకపోతే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే బాగుండేది అనిపించింది. ఓటిటి సినిమా కదా అని ఏదో చుట్టేసినట్లు అనిపిస్తుంది. అదొక్కటి చూసుకుని ఉండుంటే కచ్చితంగా విద్యా వాసుల అహం ఎఫ్ 2 రేంజ్ సినిమా అయ్యుండేది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా విద్యా వాసుల అహం.. OTT కాబట్టి వీకెండ్ ఓసారి చూడొచ్చు..