రానా దగ్గుబాటి.. ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రభు సల్మాన్ తెరకెక్కించిన సినిమా అరణ్య. ఇందులో విష్ణు విశాల్ కీలకపాత్రలో నటించాడు. ఈ ఏడాది మార్చి 26న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించింది. కానీ కరోనా ప్రభావం మాత్రం ఈ సినిమాపై కాస్త ఎక్కువగానే పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. దసరా కానుకగా ఈరోజు (అక్టోబర్ 15న) ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఇప్పటివరకు థియేటర్లలో చూడని వాళ్లు.. ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు.
విశాఖ సమీపంలోని చిలకలకోన అడవి.. అక్కడ తరతరాలుగా ఏనుగులను రక్షించే ఓ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు నరేంద్ర భూపతి (రానా). అడవి, ఏనుగుల రక్షణ కోసం పాటు పడుతున్న ఫారెస్ట్ మేన్ గా రాష్ట్రపతి పురస్కారం అందుతుంది. కేంద్రమంత్రి రాజగోపాలం (అనంత్ మహదేవన్) చిలకలకోన అడవిపై కన్నేస్తాడు.. అక్కడ డీఎల్ఆర్ టౌన్ షిప్ కట్టేందుకు రంగంలోకి దిగుతాడు. ఏనుగులు నీటి కోసం వెళ్లే అటవీ ప్రాంతంలో గోడ కూడా కట్టేస్తాడు. మరి అడవినే నమ్ముకున్న ఏనుగులు.. అరణ్య.. కేంద్ర మంత్రిపై పోరాటం ఎలా చేశారు.. అడవిని ఎలా దక్కించుకున్నారు అనేది అరణ్య స్టోరీ. ఈ చిత్రాన్ని ఏరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో శ్రీయ, జోయా హుస్సేన్ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి శాంతను సంగీతం అందించారు..