దసరా సెలవుల్లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఓటీటీలలోకి క్రేజీ మూవీస్ క్యూ కట్టాయి. ఈ క్రమంలోనే ఇవాళ ఒక్క రోజే 3 క్రేజీ సినిమాలు సందడి చేయబోతున్నాయి. అలాగే దసరా సెలవుల్లో వరుసగా ఓటీటీలో సినిమాల జాతరే. మరి ఆ చిత్రాలు ఏంటో ఇక్కడ చూసేద్దాం:
హీరోయిన్లు రెజీనా కసండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ‘శాకిని – ఢాకిని’. ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకుడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కధాంశంతో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. అందుకేనేమో ఈ మూవీని త్వరగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ‘శాకిని – ఢాకిని’ స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళ హీరో ఆర్య ప్రధాన పాత్రలో దర్శకుడు శక్తి సౌందన్ రాజన్ తెరకెక్కించిన చిత్రం ‘కెప్టెన్’. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. ‘కెప్టెన్’ మూవీ మూడు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’ ఓటీటీలో కెప్టెన్ మూవీ తెలుగు, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది.
కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘777 ఛార్లీ’. ఎలాంటి అంచనాలు లేకుండా ఈ ఏడాది జూన్ 10న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘777 ఛార్లీ’ తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇక్కడొక ట్విస్ట్ ఉంది. కేవలం రెంట్‌కు మాత్రమే ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో చూడవచ్చు. మరోవైపు ఈ చిత్రం మిగతా వెర్షన్స్ ‘వూట్’ ఓటీటీలో జూలై 29వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.
కాగా, ఇవే కాదు.. ఇవాళ థియేటర్లలో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ పార్ట్ 1 విడుదలైంది. ఇందులో విక్రమ్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. అటు బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలతో.. దర్శకులు పుష్కర్, గాయత్రి తెరకెక్కించిన ‘విక్రమ్ వేద’ సినిమా కూడా ఇవాళే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం ‘విక్రమ్ వేద’కు హిందీ రీమేక్.
మరోవైపు ఇప్పటికే ‘సోనీ లివ్’లో విక్రమ్ ‘కోబ్రా’ మూవీ.. ‘ఆహా’ ఓటీటీలో ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ చిత్రం స్ట్రీమింగ్ అవుతున్నాయి. అటు అక్టోబర్ 2వ తేదీన ‘రంగ రంగ వైభవంగా’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. ‘కార్తికేయ-2’ దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీ నుంచి ‘జీ5’ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. అలాగే ‘బింబిసార’ అక్టోబర్ 7 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..