‘ఛలో’ తరువాత హ్యాట్రిక్ ఫ్లాప్‌లతో కాస్త వెనుకబడ్డ నాగశౌర్య.. ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా తదుపరి సినిమాను ప్రారంభించేశాడు. కొత్త దర్శకుడు రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య ఓ చిత్రంలో నటించనున్నాడు. తన సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇవాళ హైదరాబాద్‌లో పూర్తయ్యాయి.
ఈ కార్యక్రమానికి సీనియర్ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, దర్శకురాలు నందినీ రెడ్డి, దర్శకుడు పరశురామ్, నిర్మాత శరత్ మరార్, దర్శకుడు బీవీఎస్ రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి షాట్‌కు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో నాగశౌర్య సరసన మెహ్రీన్ నటిస్తుండగా.. పోసాని కృష్ణమురళి, సత్య, ప్రియా రామన్, జయప్రకాశ్, కిశోర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించనున్న ఈ మూవీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు.