AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Holidays Review: సమ్మర్ హాలీడేస్ సినిమా రివ్యూ.. చిన్నప్పటి జ్జాపకాల్లోకి తీసుకెళ్లే సినిమా..!

మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు శ్రీకర్ నయన్ జి తెరకెక్కించిన సినిమా సమ్మర్ హాలిడేస్. ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Summer Holidays Review: సమ్మర్ హాలీడేస్ సినిమా రివ్యూ.. చిన్నప్పటి జ్జాపకాల్లోకి తీసుకెళ్లే సినిమా..!
Summer Holidays
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 06, 2026 | 1:13 PM

Share

మూవీ రివ్యూ: సమ్మర్ హాలీడేస్

నటీనటులు: రోహన్ రాయ్ గుంటి, అరుణ్ దేవ్, ఖుషి సోని, జయసుధ, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, వాసుకి తదితరులు

ఎడిటింగ్: సంతోష్ నాయుడు

సంగీతం: సింజిత్ యెర్రమిల్లి

సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్

దర్శకత్వం: శ్రీకర్ నయన్ జి

నిర్మాణం: ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని

కథ:

రావూరి వెంకటేష్ అలియాస్ RV (అరుణ్ దేవ్) ఎప్పుడూ చదువుల్లోనే ఉండాలని.. ఆ విషయంలో రాజీ పడకూడదని అతని తండ్రి (హర్షవర్ధన్) కఠినంగా ప్రవర్తిస్తుంటాడు. కానీ, ఆర్వీకి మాత్రం కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా బయటి ప్రపంచాన్ని చూడాలనే కోరిక ఉంటుంది. తండ్రికి ఇది ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో 2001 వేసవి సెలవుల్లో ఆర్వీ వాళ్ల అమ్మ జానకి (వాసుకి) అతడిని తోటవారిపాలెంలోని వాళ్ల అమ్మమ్మ గారింటికి తీసుకువెళుతుంది. అక్కడ RVకి చదువులంటే పెద్దగా ఆసక్తి లేని, డబ్బు సంపాదించి లైఫ్‌ని ఎంజాయ్ చేయాలనుకునే KV అలియాస్ కాశీ వెంకటేశ్వర్లు (రోహన్ రాయ్) పరిచయం అవుతాడు. ఇద్దరి ఆలోచనలు వేరైనా, వారిద్దరూ త్వరగానే మంచి మిత్రులుగా మారిపోతారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో చోటుచేసుకున్న పరిణామాలే ఈ సినిమా కథ.

కథనం:

సినిమా మొదలవ్వడమే ప్రేక్షకులను ఒక అందమైన గతం వైపు తీసుకువెళుతుంది. పట్నంలో చదువుల ఒత్తిడి, కఠినమైన తండ్రి భయం మధ్య నలిగిపోయే ఒక పిల్లాడు.. వేసవి సెలవులొస్తే చాలు అమ్మమ్మ ఊరికి ఎప్పుడు వెళ్దామా అని ఎదురుచూసే ఆనాటి రోజులను డైరెక్టర్ కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఫస్టాఫ్ మొత్తం దాదాపుగా 90వ దశకం నాటి జ్ఞాపకాల చుట్టూనే చాలా ఆహ్లాదంగా సాగుతుంది. మామిడి తోటల్లో స్నేహితులతో కలిసి అల్లరి చేయడం, ఊరి చెరువుల్లో ఈతకు వెళ్లడం, మండుటెండలో గల్లీ క్రికెట్ ఆడటం లాంటి సీన్స్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికీ తమ బాల్యం గుర్తుకురాక మానదు. దర్శకుడు ఈ వాతావరణాన్ని ఎక్కడా బలవంతంగా ఇరికించినట్లు కాకుండా కథలో బాగంగా చాలా నేచురల్‌గా తీర్చిదిద్దాడు. చదువులంటే ఇష్టం లేని ఒక పల్లెటూరి కుర్రాడు, ప్రపంచం ఏంటో చూడాలనుకునే ఒక పట్నం కుర్రాడు.. ఈ ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉన్న పిల్లల మధ్య స్నేహం చిగురించే తీరు, వాళ్ళు పంచుకునే భావోద్వేగాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి. అయితే, అసలు సమస్య అంతా సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథనం నెమ్మదిగా రొటీన్ ట్రాక్‌లోకి వెళ్లిపోతుంది. తర్వాతి సీన్ ఏంటనేది ఆడియన్స్ చాలా సులభంగా ఊహించేలా స్క్రీన్ ప్లే సాగుతుంది.

కథలో ఎలాంటి మలుపులు కానీ, కొత్తదనం కానీ లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొట్టే అవకాశం ఉంది. అయినప్పటికీ, మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్, వారు ఎదుర్కొనే చిన్నపాటి సంఘర్షణలు ఆ లోపాన్ని కొంతవరకు కవర్ చేసి సినిమాపై ఆసక్తి తగ్గకుండా చూసుకున్నాయి. అదే సమయంలో, దర్శకుడు తీసుకున్న కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఏమాత్రం కన్విన్సింగ్ గా అనిపించవు. ముఖ్యంగా సినిమా ఫస్ట్ సీన్ నుంచి కొడుకును ఒక మిషన్ లాగా చదివించాలని చూసే కఠినమైన తండ్రి పాత్ర.. క్లైమాక్స్ కు వచ్చేసరికి కొడుకు చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌తో పూర్తిగా మారిపోవడం లాజిక్ కు దూరంగా అనిపిస్తుంది. దశాబ్దాలుగా ఉన్న ఒకరి మైండ్ సెట్ క్షణాల్లో ఎలా మారిపోతుందనే లాజిక్‌ను ఇక్కడ పూర్తిగా వదిలేశారు. దర్శకుడు సమస్యను చాలా సులభంగా ముగించేయాలని చూశాడు తప్ప, అందులో సహజత్వం ఉండేలా చూసుకోలేదు. ఈ కథకు అసలు ప్రాణం క్లైమాక్స్ ఎపిసోడ్. కానీ అక్కడే ఎమోషనల్ గ్రాఫ్ కాస్త పడిపోయింది. ముగింపు సన్నివేశాలను మరింత హృదయానికి హత్తుకునేలా, బలంగా రాసుకుని ఉంటే ఈ సినిమా స్థాయి కచ్చితంగా మరోలా ఉండేది. కేవలం ఒక డీసెంట్ ఫ్యామిలీ డ్రామాగా మిగిలిపోయిన ఈ కథనంలో ఇలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ, ఆనాటి పల్లెటూరి వాతావరణం, స్వచ్ఛమైన చిన్ననాటి స్నేహాలు మాత్రం సినిమాను కూర్చుని చూసేలా చేస్తాయి.

నటీనటులు:

రోహన్ రాయ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఆ కాలంలో దిగువ మధ్యతరగతి పిల్లల లైఫ్ స్టైల్, వాళ్ళు పడే కష్టాలను తన నటనతో అద్భుతంగా చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో పరిణతితో నటించడమే కాకుండా, తన నేచురల్ డైలాగ్ డెలివరీతో సినిమాలో మంచి వినోదాన్ని పంచాడు. తండ్రికి భయపడుతూనే, తన కొత్త స్నేహితుడికి అండగా నిలబడాలనుకునే కుర్రాడిగా అరుణ్ దేవ్ బాగా నటించాడు. KV ఎక్స్‌ట్రావర్ట్ అయితే, RV ఇంట్రోవర్ట్. వీళ్లిద్దరి మధ్య ఉండే ఈ భిన్నమైన స్వభావమే వాళ్ళ ఫ్రెండ్షిప్ కు మంచి బలాన్ని ఇచ్చింది. జయసుధ తక్కువ సేపే కనిపించినా తన మార్క్ వేశారు. రాజీవ్ కనకాల కూడా తన పాత్రలో ఒదిగిపోయారు. ఖుషీ సోనీ, వాసుకిల పాత్రలకు సరైన స్కోప్ దక్కలేదు. వాసుకి క్యారెక్టర్‌ను ఇంకాస్త ఎమోషనల్‌గా డెవలప్ చేసి ఉంటే బాగుండేది. హర్షవర్ధన్ ఓకే..

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సింజిత్ యెర్రమిల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు. ఇవి సినిమా మూడ్‌ను మరింతగా పెంచాయి. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను చక్కగా క్యాప్చర్ చేసింది. సంతోష్ నాయుడు ఎడిటింగ్ పర్వాలేదు. రచయిత, దర్శకుడు శ్రీకర్ నాయన్ జి పాత కథనే తీసుకున్నా, దాన్ని ఒక డీసెంట్ పద్ధతిలో తెరకెక్కించాడు. ఆ కాలం నాటి వాతావరణాన్ని, ప్రధాన పాత్రల మధ్య బంధాన్ని చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే రాసుకున్నాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా డీసెంట్ గా ఉన్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా సమ్మర్ హాలీడేస్.. 90స్‌లోకి తీసుకెళ్లే అందమైన సినిమా..!

Follow Us