Pelli SandaD Movie Review: మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే పాట గుర్తుందా? మరి సౌందర్యలహరి సాంగు? నవమన్మథుడా అతి సుందరుడా… అని అక్కాచెల్లెళ్లు కలిసి పాడుకున్న పాట… హృదయమనే కోవెల తలుపులు ట్యూను… ఎందుకు గుర్తులేవు? రాఘవేంద్రుడు క్రియేట్ చేసిన పెళ్లి సందడి విడుదలై పాతికేళ్లయినా ఇంకా గుండెల్లో పచ్చగా మెదులుతోంది.. అని అంటారా? ఆ పెళ్లి సందడిని గుర్తుచేసేలా శ్రీకాంత్ తనయుడు యాక్ట్ చేసిన సినిమా నయా పెళ్లి సందD. ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. పాతికేళ్ల తర్వాత ఫ్రెష్‌గా సిద్ధమైన ఈ పెళ్లిసందడి ఎలా ఉంది? ఆలస్యమెందుకు చదివేయండి…
సినిమా: పెళ్లి సందD
నటీనటులు: రోషన్, శ్రీలీల, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, సత్యంరాజేష్, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, అన్నపూర్ణ, జాన్సి, ప్రగతి, హేమ, కౌముది, భద్రం, కిరీటి తదితరులు..
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సాహిత్యం: శివశక్తి దత్త, చంద్రబోస్
సినిమాటోగ్రఫి: సునీల్ కుమార్ నామ
ఎడిటర్: తమ్మిరాజు
ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె,
మాటలు: శ్రీధర్ సీపాన
ఫైట్స్: వెంకట్
కొరియోగ్రఫి: శేఖర్ వీజే
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వి. మోహన్ రావు,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి
సమర్పణ: కె. కృష్ణమోహన్ రావు
నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని
దర్శకత్వ పర్యవేక్షణ: కె. రాఘవేంద్రరావు బి.ఎ
దర్శకత్వం: గౌరీ రోణంకి.
రావిపాటి వశిష్ఠ్ (రోషన్) మంచి ఫుట్‌బాల్ ప్లేయర్. తల్లిదండ్రులకు (రావు రమేష్, ఝాన్సీ) ఒక్కడే కొడుకు. అతనికి పెళ్లి చేయాలని అనుకుంటారు. మంచి సంబంధం కోసం చూస్తుంటారు. పెదనాన్న కొడుకు పెళ్లికి వెళ్తాడు వశిష్ఠ్. అదే పెళ్లికి వచ్చిన పెళ్లికూతురు ఫ్రెండ్ సహస్ర (శ్రీలీల)ను చూస్తాడు. సహస్ర కొండవీటి కుటుంబంలో రెండో అమ్మాయి. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంటుంది. అల్లరి పిల్ల. ఆమెను తొలి చూపులోనే ప్రేమిస్తాడు వశిష్ఠ్. వారి పెళ్లికి ఎవరూ ఊహించని అడ్డంకి వస్తుంది. అదేంటి? సహస్ర తన తండ్రికి ఏ విషయంలో ప్రామిస్ చేసింది? చివరికి వశిష్ట్ ఆ అడ్డును ఎలా తొలగించాడు? సహస్రను వివాహం చేసుకోవడానికి అతని కుటుంబం సపోర్ట్ చేసిందా? లేదా? సహస్ర బావ పరిస్థితి ఏంటి? వంటివన్నీ సినిమా చూస్తే అర్థమవుతాయి.
ఈ సినిమాలో రాఘవేంద్రరావు నటించారనే అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ఆయన చేసింది హీరో కేరక్టర్. ఆయన భార్యగా దీప్తి భట్నాగర్ నటించారు. రాఘవేంద్రరావు హీరోగా చేస్తే… రోషన్ ఏం చేసినట్టు అని అనుకుంటున్నారేమో.. అతను కూడా హీరోనే. సినిమాలో ఉన్నది ఒక్క హీరో కేరక్టరే. మరి ఇద్దరు ఎలా ప్లే చేశారన్నది సస్పెన్స్.
కాఫీ తాగడానికి కారులో వెళ్తే 11 కిలో మీటర్లు, నడిచి వెళ్తే 10 కిలోమీటర్లని రాఘవేంద్రరావు చెప్పే కాన్సెప్ట్ బావుంది. మధ్యలో పాముకు పాలు పోయడం, రాణి అనే పులికి మాంసం పెట్టడం వంటివన్నీ రిలాక్సింగ్ పాయింట్స్. ఈ సినిమాలో హీరో ఫొటోలు తీసే సీను, హీరోయిన్ ఆటపట్టించే సీను, పెళ్లి పాట, అక్కా చెల్లెళ్ల అనుబంధం వంటివన్నీ పాత పెళ్లిసందడిని గుర్తుచేస్తాయి. రోషన్ స్క్రీన్ మీద బావున్నాడు. శ్రీలీల నటనలోనూ ఈజ్ ఉంది. రఘుబాబు ఎపిసోడ్ నవ్వు తెప్పించింది. వెన్నెలకిశోర్, సత్యం రాజేష్ నవ్వించే ప్రయత్నం చేశారు.
కీరవాణి సంగీతం బావుంది. షూటింగ్ లొకేషన్లు, స్క్రీన్ మీద హీరోహీరోయిన్ల పెయిర్ ఫ్రెష్‌గా అనిపించింది. స్క్రీన్‌ప్లే ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉంటే బావుండేది. డైరక్టర్‌గా శివానీ కేరక్టర్ ఇందులో సర్‌ప్రైజింగ్. క్లైమాక్స్ లో రాఘవేంద్రరావు, రోషన్ రిలేషన్‌షిప్‌ని కన్వే చేసిన తీరు కూడా బావుంది.
– డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9 తెలుగు
Also Read..
Maha Samudram Review: ప్రేమ… స్నేహం… బంధం… బాధ్యతల కలయిక ‘మహా సముద్రం’