Nari Nari Naduma Murari Movie Review: ‘నారీ నారీ నడుమ మురారి’ రివ్యూ.. శర్వానంద్ సక్సెస్ ట్రాక్ ఎక్కాడా?
సరైన కమర్షియల్ బ్రేక్ కోసం వేచి చూస్తున్న శర్వానంద్‌కి ఈ సంక్రాంతి అచ్చొచ్చినట్టే కనిపిస్తోంది. 'సామజవరగమన'తో కడుపుబ్బ నవ్వించిన దర్శకుడు రామ్ అబ్బరాజు, మరోసారి తన మార్క్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఉన్నప్పటికీ, వినోదమే ప్రధాన బలంతో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తోంది. మరి ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం.

మూవీ రివ్యూ: నారీ నారీ నడుమ మురారి
నటీనటులు: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వి.కె. నరేష్, సత్య, సుదర్శన్, వెన్నెల కిషోర్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, యువరాజ్
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
నిర్మాత: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
కథ:
గౌతమ్ (శర్వానంద్) వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్. తన సహోద్యోగి నిత్య (సాక్షి వైద్య)తో పీకల్లోతు ప్రేమలో ఉంటాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో.. గౌతమ్ గతం అతన్ని వెంటాడుతుంది. తన మాజీ ప్రేయసి దియా (సంయుక్త మీనన్) అదే ఆఫీసుకి టీమ్ లీడర్‌గా వస్తుంది. ఈ ముగ్గురి మధ్య నడిచే డ్రామా, తన గతాన్ని దాచి ప్రస్తుత ప్రేమను కాపాడుకోవడానికి గౌతమ్ పడే పాట్లు, చివరకు కథ ఎటు మలుపు తిరిగింది? అనేదే మిగిలిన కథ..
కథనం:
దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి తనకు పట్టున్న క్లీన్ కామెడీ జానర్‌నే ఎంచుకున్నారు. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చాలా సినిమాల్లో చూసిన పాయింటే అయినప్పటికీ.. దాన్ని తెరపై చూపించిన విధానం, రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తుంది. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు.. ఆఫీస్ డ్రామా ఈ సినిమాకు ప్రధాన బలం. లాజిక్‌లు వెతకకుండా మ్యాజిక్‌ని ఎంజాయ్ చేసేలా సినిమాను తీర్చిదిద్దారు. శర్వానంద్ కామెడీ టైమింగ్.. నరేష్ పాత్ర, ఆయన నటన.. కడుపుబ్బ నవ్వించే డైలాగ్స్.. కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ కంటెంట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. రొటీన్ కథ కావడం.. ఊహకందేలా ఉండే క్లైమాక్స్.. అక్కడక్కడా సాగదీసినట్లు అనిపించే సన్నివేశాలు లాంటివి మైనస్ అయ్యాయి. సంక్రాంతి పండుగకు ప్రేక్షకులు కోరుకునే అసలైన విందు భోజనం ‘నారీ నారీ నడుమ మురారి’. కథలో కొత్తదనం ఆశించకుండా.. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకోవాలనుకునే వారికి ఈ సినిమా బెస్ట్ ఛాయిస్. కుటుంబమంతా కలిసి చూడదగ్గ పక్కా పైసా వసూల్ ఎంటర్‌టైనర్ ఇది.
నటీనటులు:
చాలా గ్యాప్ తర్వాత శర్వానంద్ తనలోని పూర్తి స్థాయి కామెడీ యాంగిల్‌ని బయటపెట్టారు. అమాయకత్వం, కన్ఫ్యూజన్ కలగలిపిన పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సీనియర్ నటుడు నరేష్. హీరో తండ్రిగా ఆయన చేసిన హడావిడి, సెల్ఫ్ సెటైర్లు థియేటర్లో నవ్వుల పువ్వులు పూయించాయి. హీరోయిన్లు ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సత్య, వెన్నెల కిషోర్ తమ పంచ్ డైలాగులతో వినోదాన్ని పండించారు.
టెక్నికల్ టీం:
విశాల్ చంద్రశేఖర్ సంగీతం పండుగ వైబ్‌కి తగ్గట్టుగా హుషారుగా ఉంది. భాను భోగవరపు కథ పాతదే అయినా.. మాటలు సినిమాను నిలబెట్టాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి, ప్రతి ఫ్రేమ్‌లోనూ ఖర్చు కనిపిస్తుంది. దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి మెప్పించాడు. ఎడిటింగ్ పర్ఫెక్ట్.. సినిమాటోగ్రఫీ బాగుంది.
పంచ్ లైన్:
ఓవరాల్ గా నారినారి నడుమ మురారి.. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
