Chennai Love Story Review : చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ.. గుండెల్ని మెలిపెట్టే ప్రేమకథతో వచ్చిన కిరణ్ అబ్బవరం..!
క, K ర్యాంప్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. అలాగే బేబీతో సంచలన విజయం అందుకున్న సాయి రాజేష్ కథతో వచ్చిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: చెన్నై లవ్ స్టోరీ
నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీప్రియ, త్రిగుణ్, పి వాసు, కరుణ కుమార్, సిరి హన్మంతు, పూజా, నవీన్ నేని, దేవీ ప్రసాద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: డేనియల్ విశ్వాస్
ఎడిటింగ్: సంతోష్ నాయుడు
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: SKN, సాయి రాజేష్
కథ, మాటలు: సాయి రాజేష్
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకుడు: రవి నంబూరి
క, K ర్యాంప్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకున్నాడు కిరణ్ అబ్బవరం. అలాగే బేబీతో సంచలన విజయం అందుకున్న సాయి రాజేష్ కథతో వచ్చిన సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) ఓ అనాధ. ఎలాగైనా దర్శకుడు కావాలని, వెండితెరపై తన పేరు చూసుకోవాలని కలలు కనే కుర్రాడు. తన కలల కోసం చెన్నై వచ్చేస్తాడు.. ఇక్కడ అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు నివి (శ్రీ గౌరీప్రియ), అజయ్ (త్రిగుణ్) ప్రేమించుకుంటారు.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న టైమ్‌లో సడన్‌గా ఆమెను వదిలేసి వెళ్లిపోతాడు అజయ్. దాంతో నివి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. చెన్నై వెళ్లి వాళ్ల ఫ్రెండ్స్‌తో పాటే ఉంటుంది. అదే సమయంలో వాళ్ళ జీవితంలోకి వస్తాడు స్టీవెన్. తనదైన కథలు చెప్తూ వాళ్లతో పాటే ఉంటాడు. ఆ పరిచయంలోనే స్టీవెన్‌కు నివి ఓ సాయం చేస్తుంది.. దాంతో ఆమెను తన దృష్టిలో దేవతలా చూసుకుంటాడు స్టీవెన్. మెల్లగా వాళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో నివి జీవితంలో మరో ఊహించని కుదుపు చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది..? అజయ్ మళ్లీ ఎందుకు నివి జీవితంలోకి వస్తాడు..? అసలు స్టీవెన్ శంకర్‌కు ఏమైంది అనేది అసలు కథ..
కథనం:
ఇండస్ట్రీలో ఓ సినిమా సాధించిన విజయం, అది సృష్టించిన ఇంపాక్ట్ ఆ తర్వాతి సినిమాలపై భారీ అంచనాలను పెంచేయడం సహజం. సరిగ్గా ఇలాంటి అంచనాలతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. దర్శకుడు సాయి రాజేష్ గత చిత్రం ‘బేబీ’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆయన ఎంచుకున్న బోల్డ్ కంటెంట్, సున్నితమైన ఎమోషన్స్ చూసిన తర్వాత, ఆయన కలం నుండి వస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ ఎలా ఉండబోతోందనే ఆసక్తి, ఒకరకమైన భయం ప్రేక్షకుల్లో నెలకొన్నాయి. ఆ క్యూరియాసిటీతోనే థియేటర్‌లో అడుగుపెట్టిన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక భిన్నమైన అనుభూతి పంచుతుంది. సినిమా మొదలైనప్పటి నుండి ఇంటర్వెల్ వరకు సాయి రాజేష్ రాసిన కథ ప్రేక్షకులను అద్భుతంగా కదిలిస్తుంది. ఒక స్వచ్ఛమైన, బలమైన ఎమోషనల్ డ్రామాగా సాగే ఫస్ట్ హాఫ్.. ఎక్కడా ఎలాంటి కంప్లైంట్స్‌కు తావివ్వకుండా చాలా సాఫీగా, ఆసక్తికరంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఇచ్చిన ఊహించని ట్విస్ట్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా అమాంతం పెంచేస్తుంది. అంతటి హై-రిస్క్ ఇంటర్వెల్ బ్లాక్ రాసుకున్న తర్వాత, ద్వితీయార్థంలో ఈ కథను దర్శకుడు ఎలా డీల్ చేయబోతున్నాడు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఉత్కంఠను రేకెత్తించడంలో ఫస్ట్ హాఫ్ నూటికి నూరు శాతం సక్సెస్ అయింది.
ఇంటర్వెల్ వరకు ఎంతో అద్భుతంగా సాగిన ప్రయాణం సెకండ్ హాఫ్‌కు వచ్చేసరికి కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన కిక్, ఆ స్థాయి ఎమోషన్ ద్వితీయార్థంలో కొంచెం లోపించాయి. అలాగని కథ పూర్తిగా గాడి తప్పిందని చెప్పలేం కానీ, గమనం మాత్రం నెమ్మదించింది. మధ్యమధ్యలో వచ్చే రెండు మూడు ఎమోషనల్ సన్నివేశాలు బాగానే పేలినా, ఓవరాల్ ఇంపాక్ట్ మాత్రం తగ్గింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. మెయిన్ కథాంశం అంతా ఫస్ట్ హాఫ్‌లోనే పూర్తి కావడంతో, సెకండ్ హాఫ్‌లో కథను ముందుకు నడిపించడానికి దర్శకుడు రవి కాస్త ఇబ్బంది పడ్డారు. కనెక్ట్ కావాల్సిన ఎమోషన్స్ కూడా పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదు. ఇలాంటి సున్నితమైన కథలకు ముగింపు పలకడం రచయితలకు ఎప్పుడూ కత్తిమీద సామే. దానికి తగ్గట్టుగానే క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ముందుగానే ఊహించినట్లు ముగిసిపోతుంది. అయితే చెన్నై లవ్ స్టోరీలో కొన్ని మూవెంట్స్ అయితే ఉన్నాయి. వాటిని చూసినపుడు కచ్చితంగా గుండె బరువెక్కుతుంది. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో తన గురించి కిరణ్ ఫ్రెండ్స్‌కు చెప్పే సీన్.. సెకండాఫ్‌లో దేవుడు పేరుతో వచ్చే సీన్ చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. ఇలాంటి కొన్ని సన్నివేశాల కోసం చెన్నై లవ్ స్టోరీని ఈజీగా ఓసారి ట్రై చేయొచ్చు.
నటీనటులు:
హీరో కిరణ్ అబ్బవరం తన పాత్రలో అద్భుతంగా నటించాడు. ఒక నటుడిగా ఈ క్యారెక్టర్ అతన్ని కచ్చితంగా మరో మెట్టు ఎక్కిస్తుందని చెప్పవచ్చు. ఇక హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. నిజానికి కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ బాధ్యతను ఆమె తన అద్భుతమైన నటనతో వంద శాతం నెరవేర్చింది. త్రిగుణ్ కీలక పాత్రలో మెప్పించాడు. దర్శకులు పి వాసు, కరుణ కుమార్ చిన్న పాత్రలే అయినా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్స్‌లో కనిపించారు. స్నేహితులుగా సిరి హన్మంతు, పూజా, నవీన్ నేని బాగున్నారు. దేవీ ప్రసాద్ లాంటి సీనియర్ నటులు బాగా నటించారు.
టెక్నికల్ టీం:
మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. తన నేపథ్య సంగీతంతో ఎమోషనల్ సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా పాటలు కూడా చాలా బాగున్నాయి. సంతోష్ నాయుడు ఎడిటింగ్ కాస్త వీక్.. సెకండాఫ్‌పై ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. డేనియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా అంతా చాలా నీట్‌గా ప్రజెంట్ చేసారు. సాయి రాజేష్ రైటింగ్ బాగుంది.. కాకపోతే సెకండాఫ్ మీద ఇంకాస్త వర్క్ చేసుంటే చెన్నై లవ్ స్టోరీ అద్భుతమైన ప్రేమకథగా మిగిలేది. సాయిరాజేష్ కథకు దర్శకుడు రవి నంబూరి తన మాటలు, స్క్రీన్ ప్లేతో ప్రాణం పోశాడు. ఆయన దర్శకత్వం సినిమాకు ప్లస్. SKN నిర్మాణ విలువలు బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా ‘చెన్నై లవ్ స్టోరీ’.. గుండెల్ని తాకే ఓ మంచి ప్రేమకథ..!
