Pushpa Movie Review: పుష్ప ఫైర్‌మీదున్నాడు…. ఏం పుష్పా… పార్టీ ఎప్పుడు?

| Edited By: Rajeev Rayala

Dec 17, 2021 | 1:48 PM

Pushpa Movie Review : ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాలకు సమానం. మేం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అదంతా స్క్రీన్‌ మీద కనిపించవచ్చు.

Pushpa Movie Review:  పుష్ప ఫైర్‌మీదున్నాడు.... ఏం పుష్పా... పార్టీ ఎప్పుడు?
Pusshpa
Follow us on

ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాలకు సమానం. మేం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. అదంతా స్క్రీన్‌ మీద కనిపించవచ్చు. కనిపించకపోవచ్చు. కానీ ఆడియన్స్ తప్పక నోటీస్‌ చేస్తారు…. పుష్ప గురించి ప్రమోషన్‌ టైమ్‌లో అల్లు అర్జున్‌ చెప్పిన మాటలివి. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్రగంధపు చెక్కల గురించి, అక్కడ ఎదిగిన పుష్పరాజ్‌ గురించి జనాలు ఏమంటున్నారు?

సినిమా: పుష్ప ది రైజ్‌
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా
నిర్మాత: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌
నటీనటులు: అల్లు అర్జున్‌, రష్మిక, ఫాహద్‌ ఫాజిల్‌, సునీల్‌, ధనుంజయ, అజయ్‌, అజయ్‌ఘోష్‌, అనసూయ, రావు రమేష్‌ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌, రుబెన్‌
కెమెరా: మిరోస్లా కూబా బ్రొజెక్‌
రచన, దర్శకత్వం: సుకుమార్‌
విడుదల: 17.12.2021

పుష్ప అలియాస్‌ పుష్పరాజ్‌ (అల్లు అర్జున్) కూలీ పని చేసుకుంటూ ఉంటాడు. వంద రూపాయలు కూలీ కావాలా? వెయ్యి రూపాయలు కూలీ కావాలా? అన్నప్పుడు వెయ్యి రూపాయలు వచ్చే ఎర్రగంధపు చెక్కలు కొట్టే పనికే వెళ్తాడు పుష్ప. అక్కడ తన తెలివి తేటలతో ఎదుగుతాడు. ఆ ఎదిగే క్రమంలో ఆ వ్యాపారంలో ఉన్నవారితో నాలుగు శాతం పార్ట్ నర్‌ షిప్‌ కి ఒప్పందం చేసుకుంటాడు. దాని వల్ల అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అతని ప్రయాణంలో శ్రీవల్లి (రష్మిక) ఎక్కడ తారసపడింది? ఆమెతో అతని పరిచయం పెళ్లి పీటల మీదకు వెళ్లిందా లేదా? జాలీరెడ్డి (ధనుంజయ) వల్ల శ్రీవల్లి ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? ఎర్రగంధపు చెక్కల స్మగ్లింగ్‌లో పోలీసుల నుంచి పుష్పకు ఎదురైన ఇబ్బందులేంటి? చెన్నై మురుగన్‌ ఎవరు? మంగళం శ్రీను (సునీల్‌), అతని భార్య దాక్షాయిణి (అనసూయ)తో పుష్పకున్న సంబంధం ఎలాంటిది? మధ్యలో కొండారెడ్డి(అజయ్‌ ఘోష్‌) మంచివాడా? చెడ్డవాడా? ఇంతకీ ఎంపీ(రావు రమేష్‌) సపోర్ట్ ఎవరికి..? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

పుష్ప కేరక్టర్‌లోని అల్లు అర్జున్‌ పరకాయ ప్రవేశం చేశారు. చిత్తూరు యాసను యాజ్‌ ఇట్‌ ఈజ్‌గా దింపేశారు. లుక్‌, కాస్ట్యూమ్స్, ఎడమ భుజం మేనరిజం, తగ్గేదేలే అనే ఊతపదం… ఇవి మాత్రమే కాదు… వాటన్నిటినీ మించి భాషను చాలా బాగా నేర్చుకున్నారు. చిత్తూరు మాండలికం మీద ఆయన చేసిన సాధన స్క్రీన్‌ మీద స్పష్టంగా కనిపించింది. శ్రీవల్లి పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా రష్మిక లుక్‌ చాలా బావుంది. ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి, అదే సమయంలో అమాయకత్వం ఉన్న అమ్మాయిగా రష్మిక మెప్పించారు. అజయ్‌ ఘోష్‌ కొత్త లుక్‌ ట్రై చేశారు. శత్రుని చాలా సేపు వరకు ఎవరూ గుర్తుపట్టరు. అంతగా మేకోవర్‌ అయ్యారు ఈ సినిమా కోసం. కన్నడ ఆర్టిస్ట్ ధనుంజయ తన పరిధిలో బాగా నటించారు. ఇటు సునీల్‌కి మేకప్‌ చక్కగా సూట్‌ అయింది. శ్రీను కేరక్టర్‌కి చక్కగా సూట్‌ అయ్యారు. అతని భార్యగా అనసూయ కొత్తలుక్‌లో మెప్పించారు. క్లైమాక్స్ లో కాసేపే కనిపించినా ఫాహద్‌ ఫాజిల్‌ కేరక్టర్‌ సెకండ్‌ పార్ట్ కి మంచి లీడ్‌ ఇచ్చినట్టయింది. పుష్ప ఫ్రెండ్‌ కేరక్టర్‌ చేసినతనికి మంచి ఫ్యూచర్‌ ఉంది.

టైటిల్స్ ప్లే చేయడంలో కెప్టెన్‌ సుకుమార్‌ది ఎప్పుడూ స్పెషల్‌ స్టైల్‌. ఈ సినిమా స్టార్టింగ్‌లో ఓ ఫారిన్‌ కథ చెప్పడం, అందులోనుంచి గంధపు చెక్కకున్న ఇంపార్టెన్స్ ని ఎలివేట్‌ చేయడం, అక్కడి నుంచి శేషాచలం అడవులను చూపించడం… ఆ మధ్యలో టైటిల్స్ పడటం… ఎఫెక్టివ్‌గా ఉంది. టెక్నీషియన్లను గౌరవిస్తూ ఎవరు ఏ పాటకు నృత్యాలు కంపోజ్‌ చేశారు? ఎవరు ఏ ఫైట్‌ను కంపోజ్‌ చేశారో మెన్షన్‌ చేయడం మెచ్చుకోవాల్సిన విషయం. లారీ స్టార్ట్ చేసినప్పుడు స్పీడ్‌గా గాల్లోకి ఎగిరే సన్నివేశాలు బావున్నాయి. టఫ్‌ లొకేషన్లలో చిత్రీకరించినట్టు చూడగానే అర్థమైపోతుంది. కేరక్టర్ల లుక్‌ని డిజైన్‌ చేసిన తీరు కూడా ఆథంటిక్‌గా ఉంది. ఊ అంటావా మావా… సాంగ్‌కి థియేటర్లో సందడి గట్టిగానే కనిపిస్తోంది. దాక్కో దాక్కో మేకకి కూడా స్పందన బాగా ఉంది. సామీ సామీ పాటలో స్టెప్పులు బావున్నాయి. హీరోకీ, హీరో ఫ్రెండ్‌కీ మధ్య సిట్చువేషనల్‌ కామెడీ ఒక టైమ్‌లో బాగా నడిచేది. ఈ సినిమాల్లో దాన్ని రిపీట్‌ చేసి సక్సెస్‌ అయ్యారు సుకుమార్‌. ఫైట్స్ గురించి తప్పకుండా స్పెషల్‌గా మెన్షన్‌ చేయాలి.

ఈ మధ్య కాలంలో సినిమాలన్నీ రెండున్నర గంటలకే పరిమితమైపోవడంతో దాదాపు మూడు గంటలున్న పుష్ప నిడివి కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ కి వచ్చే సరికి ప్రేక్షకుల్లో అక్కడక్కడా ఆ నిడివి తాలూకు అసహనం కనిపించింది. ఫస్ట్ పార్ట్ కి పుష్ప ది రైజ్‌ అని టైటిల్‌ పెట్టిన మేకర్స్… సెకండ్‌ పార్ట్ ని పుష్ప ది రూల్‌ అని కన్‌ఫర్మ్ చేశారు. మాస్‌కు నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. బ్రాండ్‌కి సంబంధించిన డైలాగులు, శ్రీవల్లితో రొమాంటిక్‌ సన్నివేశాలు యూత్‌ని అట్రాక్ట్ చేస్తాయి. పుష్ప సినిమాలో చెప్పినట్టు ఫ్లవర్‌ కాదు… ఫైర్‌!

– డా. చల్లా భాగ్యలక్ష్మి

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda Movie Review: థియేటర్లకు పండగ శోభ తెచ్చిన ‘అఖండ

Raja Vikramarka Review: ఫక్తు కమర్షియల్‌ సినిమా రాజా విక్రమార్క