‘Laal Singh Chaddha’ Day 1 Collection: భారీ అంచనాల మధ్య నిన్న (ఆగస్ట్ 11న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ‘లాల్ సింగ్ చద్దా’ మువీ బాక్సాఫీస్ కలెక్షన్లు నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మువీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన విషయం తెలిసిందే. తొలి రోజు కొత్త రికార్డు క్రియేట్ చేస్తుందని చిత్ర బృందం ఆశించింది. ఐతే మొదటి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు అంచనాలను తలకిందులు చేస్తూ వచ్చాయి. కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా అభిమానుల్లో కొంత నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. ప్రారంభ రోజున కేవలం రూ.11 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. 15 నుంచి 20% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇది అమీర్ ఖాన్ చిత్రానికి ఆందోళన కలిగించే అంశమని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఐతే రానున్న రోజుల్లో మంచి వసూళ్లు రాబట్టవచ్చనే అభిప్రాయాలు గట్టిగానే వినబడుతున్నాయి.
నిన్న ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతోపాటు, అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షా బంధన్’ మువీ కూడా విడుదలైంది. నివేదికల ప్రకారం ‘రక్షా బంధన్’ మువీ కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. తొలి రోజున కేవలం రూ.10 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. కాగా అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ విడుదలకు ముందే పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. గతంలో అమీర్, కరీనా చేసిన ప్రకటనల కారణంగా ఈ చిత్రాన్ని బహిష్కరించాలని సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దీనిపై ఆమీర్ ప్రేక్షకులకు క్షమాపణలు కూడా తెలిపాడు. మువీ విడుదల సందర్భంగా థియేటర్లలో సినిమాను చూడాలని అభిమానులను కోరారు.