కొన్ని కాంబినేషన్లు అంతే.. అంత ఈజీగా ఫిక్స్ అవ్వవు. మరికొన్ని కాంబినేషన్లు ఫిక్స్ అయినా సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోవడమే.. లేక మధ్యలో అటకెక్కడమో జరుగుతుంటాయి. ఇప్పుడు కొరటాల, రామ్ చరణ్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఒక్కటి కాదు రెండు సార్లు అధికారిక ప్రకటన వచ్చింది. ‘మిర్చి’ సినిమా వెంటనే రామ్ చరణ్‌తో సినిమాను తీయాలనుకున్నాడు కొరటాల. దీనిపై అధికారిక ప్రకటన రావడమే కాదు పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. నిర్మాతగా బండ్ల గణేష్, హీరోయిన్‌గా కేథరిన్‌ను కూడా ఫిక్స్ అయ్యారు. అయితే కారణాలు తెలీవు గానీ ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లకముందే ఆగిపోయింది. ఇక ఆ తరువాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయ్యారు.
అదలా ఉంచితే రామ్ చరణ్ ‘రంగస్థలం’ షూటింగ్‌లో ఉన్న సమయంలోనూ కొరటాలతో మూవీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. బోయపాటి సినిమా తరువాత ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు ప్రకటించారు. కానీ బోయపాటి మూవీ తరువాత రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీకి ఒప్పుకోవడం.. మరోవైపు కొరటాల, చిరును ఫిక్స్ చేసుకోవడంతో ఈ కాంబినేషన్‌కు మళ్లీ బ్రేక్ పడింది. ఇదిలా ఉంటే చెర్రీతో తన సినిమా ఎందుకు ఆగిపోయిందో తాజాగా వివరణ ఇచ్చాడు కొరటాల. చెర్రీ కోసం తాను తయారు చేసిన కథ అతడికి బాగా నచ్చిందని.. కానీ ఫైనల్ స్క్రిప్ట్ తనకు నచ్చకపోవడం వలనే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పుకొచ్చాడు. చెర్రీకి ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలి కానీ.. సినిమాను ప్రకటించాం కదా అని తొందరపడి ఏదో తీయడం బావుండదని కొరటాల భావించారట. ఇక ఇదే విషయాన్ని చరణ్ దగ్గర ప్రస్తావించగా.. స్క్రిప్ట్‌పై నమ్మకం ఉన్నప్పుడే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తామని చెప్పాడట. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కొరటాల చివరకు చెర్రీతో సినిమా కచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో తమ కాంబినేషన్‌లో సినిమా మాత్రం పక్కా అని చెప్పి.. అభిమానులను భరోసా ఇచ్చాడు కొరటాల. ఇదిలా ఉంటే చిరంజీవితో కొరటాల తీయబోయే చిత్రానికి చెర్రీ ఒక నిర్మాతగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.
అయితే గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ విషయంలోనూ దాదాపుగా ఇలానే జరిగింది. ఎన్టీఆర్ నటించిన పలు అడ్వర్టైజ్‌మెంట్లకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు. దీంతో ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వచ్చాయి. కానీ దానికి సరైన సమయం కుదరలేదు. ఇక ఆ ముహూర్తం గతేడాది కుదరడం.. వీరిద్దరి కాంబినేషన్లో అరవింద సమేత రావడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం వరుసగా జరిగాయి.