హైదరాబాద్: ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. ఇటీవల ‘హిప్పీ’ సినిమాతో అతడు ప్లాప్ చవి చూసినా.. దాని నుంచి త్వరగానే కోలుకుని మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. ఈ సినిమా ఆగష్టు 2న విడుదల కాబోతోంది. ఈ చిత్ర టీజర్‌ను కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
ట్రైలర్ విషయానికి వస్తే.. సరదాగా జీవితాన్ని సాగిస్తున్న గుణ(కార్తికేయ).. మొదటి చూపులోనే సెల్ ఫోన్ షాప్‌లో పని చేసే అమ్మాయి(అనఘా)తో ప్రేమలో పడతాడు. గుణ.. అతడి స్నేహితుడు(రంగస్థలం మహేష్)తో కలిసి పదే పదే షాప్‌కు వెళ్తూ ఆ అమ్మాయితో పరిచయాన్ని పెంచుకుంటాడు. ఇక వీరి ప్రేమ పెళ్లి పీటల వరకూ వెళ్తున్న సమయంలో అనుకోని అతిథిలా వారి జీవితంలోకి గద్దలగుట్ట రాధా(ఆదిత్య మీనన్)వస్తాడు. ఇక అక్కడ నుంచి గుణ జీవితంలో ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి. అసలు రాధా ఎవరు.? వీరికి.. అతనికి మధ్య సంబంధం ఏమిటి.? గుణ ప్రేమలో సఫలమవుతాడా.? అనే ప్రశ్నలకు సమాధానం వెండి తెరపై చూడాలి.
ట్రైలర్ మొదట్లో కొన్ని ప్రేమ సన్నివేశాలు.. ఆ తర్వాత యాక్షన్ సన్నివేశాలతో ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు అర్జున్ జంధ్యాల తన గురువు బోయపాటి శ్రీను మార్క్‌ను చూపించాడని చెప్పవచ్చు. హీరో కార్తికేయ.. అటు లవర్ బాయ్‌గా.. ఇటు యాక్షన్ హీరోగా రెండు షేడ్స్‌లోనూ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ అనఘా ట్రెడిషనల్ లుక్స్‌లో మెప్పించింది. ‘మనిషి రూపం వేరు.. నిజస్వరూపం వేరు’, నేను ఏడారిలో ఉన్నా.. గొంతెండిపోతోంది. కొన్నే నీళ్లు దొరికాయి. అవి మంచివా.. చెడ్డవా అని ఆలోచించే ఓపిక తీరిక నాకు లేవు’. ఈ రెండు డైలాగులను ట్రైలర్‌లో హైలైట్ చేశారు.
ఆదిత్య మీనన్, సీనియర్ నటి మంజు భార్గవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. హీరో కార్తికేయ ‘ఆర్ఎక్స్100’ మించి హిట్ ఈ సినిమాతో సాధిస్తాడనేలా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.