RAPO: హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. అయినా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయా?

రామ్‌ పోతినేని హీరోగా మహేష్‌ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన సినిమా 'ఆంధ్రా కింగ్‌ తాలూకా’. పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారందరూ బాగుందని రివ్యూ చెప్పారు కూడా. టాక్‌తోపాటు రివ్యూలు ..

RAPO: హిట్ టాక్ తెచ్చుకున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’.. అయినా కలెక్షన్లు నిరాశపరుస్తున్నాయా?
Rapo

Updated on: Dec 02, 2025 | 4:54 PM

రామ్‌ పోతినేని హీరోగా మహేష్‌ బాబు దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన సినిమా ‘ఆంధ్రా కింగ్‌ తాలూకా’. పోయిన శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమా చూసిన వారందరూ బాగుందని రివ్యూ చెప్పారు కూడా. టాక్‌తోపాటు రివ్యూలు, రేటింగ్‌లు కూడా బాగానే వచ్చాయి.

చాలా కాలం నుంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రామ్ పోతినేని ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి మాస్ క్యారెక్టర్ల వరకు ఏది చేసినా ఆయనకు హిట్ అందలేదు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ నటించిన సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.

డబల్ యాక్షన్ చేసిన రెడ్ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించలేకపోయింది. మాస్ అండ్ క్లాస్ క్యారెక్టర్లను ప్రయత్నిస్తూ చేసిన ది వారియర్ సినిమా కూడా ఆకట్టుకోలేదు. ఎన్నో అంచనాల మధ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మరోసారి పూరి దర్శకత్వంలో చేసిన డబుల్ ఇస్మార్ట్‌పైన రామ్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.

దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనుకున్న రామ్.. ఆంధ్రా కింగ్ తాలూకా అనే డిఫరెంట్ టైటిల్‌తో థియేటర్లలోకి వచ్చాడు. అనుకున్నట్టుగానే హిట్ టాక్ అందుకున్నాడు. హిట్ ట్రాక్ ఎక్కాడు. దాదాపు 6 సంవత్సరాల తర్వాత తన రేంజ్ హిట్‌ అందుకున్నాడు రాపో. అయితే, ఈ సినిమా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో లేవని అంటున్నారు. ఓపెనింగ్ వసూళ్ల సంగతి అటుంచితే క్రమంగా కలెక్షన్లు తగ్గుతూ వస్తున్నాయని టాక్.

ఈ సినిమా బడ్జెట్‌ రూ.65 కోట్లు కాగా 4 రోజుల్లో వరల్డ్‌ వైడ్‌ షేర్‌ 9 కోట్లు కలెక్ట్ చేసింది. డిజిటల్‌ రైట్స్‌ 30 కోట్లు అని టాక్. ఇక, మిగిలింది థియేట్రికల్‌ బిజినెస్‌ మాత్రమే. అయితే, తొలివారంలో కేవలం 30% రికవర్ చేసింది ఈ సినిమా. వచ్చే వారం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ 2 సినిమా విడుదలకానుంది.

భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఆ సినిమాతో రామ్ మూవీ కలెక్షన్లు మరింత తగ్గవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల మాట అటుంచితే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రామ్ పోతినేని హిట్ ట్రాక్ ఎక్కేసినట్టేనని అభిమానులు సంతోషపడుతున్నారు.