
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలపై ప్రభావాన్ని చూపిస్తోంది. మందులేని ఈ వైరస్‌కు అడ్డువేసే క్రమంలో చాలా దేశాలు లాక్‌డౌన్ ప్రకటించడంతో.. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు బ్రేక్ పడింది. ప్రపంచవ్యాప్తంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో పాటు.. విడుదల కావాల్సిన మూవీల రిలీజ్‌లు వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కూడా వాయిదా పడింది. ఈ మేరకు దర్శకుడు, గతంలో జ్యూరీ మెంబర్ అయిన రాహుల్ రావైల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మే 3న జరగాల్సిన జాతీయ అవార్డు ప్రధానోత్సవం నిరవధికంగా వాయిదా పడిందని అన్నారు.
సాధారణంగా ఈ పాటికి జ్యూరీ ఏర్పాటై ఏప్రిల్ చివరిలోగా విన్నర్‌ల లిస్ట్‌ను తయారు చేసేవాళ్లు. అలాగే మే లో ప్రధానోత్సవం జరిగేది. కానీ ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఇంకా జ్యూరీనే ఏర్పాటు కాలేదు. అందుకే అవార్డుల ప్రధానోత్సవం వాయిదా పడింది రాహుల్ తెలిపారు. అంతేకాదు కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పెద్దగా సినిమాలు విడుదల కాలేవని.. ఈ క్రమంలో వచ్చే ఏడాది అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించడం కష్టమేనని ఆయన వివరించారు. కాగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గతేడాది కూడా జాతీయ అవార్డుల వేడుక వాయిదా పడింది. ఈ క్రమంలో విజేతల పేర్లను ఆగష్టులో ప్రకటించగా.. ప్రధానోత్సవం డిసెంబర్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే.
Read This Story Also: కరోనా అప్‌డేట్స్.. దేశవ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!