బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు ఇటీవలే మరోసారి బెదిరింపులు వచ్చాయి. కెనడాలో ఉన్న ప్రముఖ సింగర్, సల్మాన్ సన్నిహితుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కాల్పులు జరిగిన కొద్ది సేపటికే సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ఇది తమ పనేనంటూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కూడా ప్రకటించింది. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఉన్న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా సల్మాన్ ఖాన్‌కు ఈ బెదిరింపులు వచ్చాయి. దీంతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను మరోసారి సమీక్షించారు ముంబై పోలీసులు. అదే సమయంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిష్ణోయ్ ఫేస్ బుక్ పోస్ట్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. విచారణ వేగవంతం చేశారు. అయితే ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సల్మాన్‌ను స్పెయిన్ నుంచి బెదిరించినట్లు క్రైమ్ బ్రాంచ్ విచారణలో తేలింది. అ తమ ఐడెంటిటీ కనిపించకుండా వీపీఎన్ సహాయంతో ఫేస్ బుక్‌లో ఈ పోస్ట్ చేశారని తెలిసింది. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఎక్కడి నుంచి షేర్ అవుతున్నాయో ఇతరులకు తెలియకుండా ఉండేందుకు వీపీఎన్‌ను ఉపయోగిస్తారు. దీనిని ఉపయోగంచే గిప్పీ, సల్మాన్‌లకు ఫేస్‌బుక్‌లో బెదిరింపు పోస్ట్ చేశారు.
కాగా బెదిరింపు అందుకున్న ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను పరిశీలించారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు కాలేదు. కెనడాలోని గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కాల్పులు జరిగాయని, ఆ తర్వాత ఫేస్‌బుక్ పోస్ట్ బయటకు వచ్చింది. ఫేస్ బుక్ ఖాతాలో లారెన్స్ ఫొటోతో పోస్ట్ చేశారు. అందులో ‘నువ్వు (గిప్పీ గ్రెవాల్ ) సల్మాన్ ను నీ అన్నయ్యగా భావిస్తున్నావు. ఇప్పుడు మీ సోదరుడు ముందుకు వచ్చి మిమ్మల్ని కాపాడాల్సిన టైమ్ వచ్చింది. సల్మాన్ ఖాన్ కు కూడా ఈ మెసేజ్ అందాలి. దావూద్ ఇబ్రహీం మిమ్మల్ని రక్షిస్తాడనే భ్రమలో ఉండకండి. మిమ్మల్ని ఎవరూ రక్షించలేరు. మీరు ప్రస్తుతం మా రాడార్‌లోనే ఉన్నారు. ఏ దేశానికైనా పారిపోండి. కానీ మరణానికి వీసా అవసరం లేదు. ఎలాంటి ఆహ్వానం లేకుండా మీకు చావు ఎదురు రావొచ్చు’ అని బిష్ణోయ్ గ్యాంగ్ ఫేస్ బుక్‌లో పోస్ట్ షేర్ చేసింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ ఇటీవలే టైగర్ 3 సినిమాతో మన ముందుకు వచ్చాడు. దీపావళి కానుకగా విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ ఏకంగా రూ.500 కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..