దక్షిణాది చిత్రాలు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. థియేటర్లలో అత్యధిక వసూళ్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేశాయి. కేవలం మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ సౌత్ మూవీస్ సత్తా చాటాయి. ఇక గత కొద్ది రోజులుగా బాలీవుడ్ ఇండస్ట్రీ కఠిన పరిస్థితులు ఎదుర్కొంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస డిజాస్టర్లతో బాలీవుడ్ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇటీవల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన రణబీర్ కపూర్ షంషెరా సైతం ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీ పని ఖాతమైందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్స్ పై నిర్మాత కరణ్ జోహర్ (Karan Johar) స్పందిస్తూ.. బీటౌన్ ఇండస్ట్రీని ఖాతమైందనేది కేవలం చెత్త వాగుడు మాత్రమే అని అన్నారు. ప్రస్తుతం సినిమాలను ఆదరించడం.. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమనేది పెద్ద సవాలుగా మారిందని.. కానీ మంచి చిత్రాలు మాత్రం ఎప్పటికీ హిట్ అవుతాయి అన్నారు.
ఇటీవల ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ.. “బీటౌన్ ఇండస్ట్రీ పని ఖాతమైందంటూ వస్తున్న వార్తలు కేవలం చెత్తవాగుడు మాత్రమే. ఆ వార్తలలో ఎలాంటి అర్థం లేదు. మంచి సినిమాలు ఎప్పటికీ పనిచేస్తాయి. గంగూబాయి కతియావాడి, భూల్ భూలయ్యా 2 సూపర్ హిట్ అయ్యాయి. అలాగే జగ్ జగ్ జీయో సినిమా కూడా భారీగానే వసూళ్లు సాధించింది. మంచిగా లేని సినిమాలు ఎప్పటికీ పనిచేయవు. కానీ ఇప్పుడు సౌత్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వాటి ముంది హిందీ చిత్రాల హిట్స్ ఎవరికీ కనిపించట్లేదు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాల విజయాలు మన బాలీవుడ్ సినిమాలను కప్పేశాయి. అయితే పరిస్థితి మారుతుంది. మన దగ్గర చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షాబంధన్, బ్రహ్మాస్త్రా సినిమాలు రాబోతున్నాయి. ఇవి విజయం సాధించి మళ్లీ బాలీవుడ్ ను వెలిగిస్తాయి. మాకు పూర్తి నమ్మకం, ప్రేమ ఉన్నాయి. మంచి కంటెంట్ ను సృష్టిస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు.
దాదాపు ఆరేళ్ల తర్వాత కరణ్ దర్శకత్వం వహించిన సినిమా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం అంత సులభం కాదు. వారిని థియేటర్లలోకి రప్పించడమనేది పెద్ద సవాలు. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, అలియా భట్, షబానా అజ్మీ, ధర్మేంద్ర, జయా బచ్చన్ కీలకపాత్రలలో నటించారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.