ఏకే వర్సెస్ ఏకే సినిమాలో ఐఏఎఫ్‌కి (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) సంబంధించి అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని వాటిని వెంటనే డిలిట్ చేయాలని ఐఏఎఫ్ సంస్థ అధికారిక ఖాతాలో ట్వీట్ చేసింది. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్-డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న చిత్రం ఏకే వర్సెస్ ఏకే. విక్రమాదిత్య మోత్వనే డైరెక్టర్ కాగా అనిల్ కపూర్, అనురాగ్ వారి నిజజీవిత పాత్రలను పోషిస్తున్నారు. డిసెంబర్ 7న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనిల్ కపూర్ ఐఏఎఫ్ యూనిఫామ్ లో మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. మూవీ ప్రమోషనల్ క్లిప్ ను అనిల్ ట్విటర్ ద్వారా షేర్ చేశాడు.
అయితే ఈ ట్రైలర్ పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. అనిల్-అనురాగ్ మధ్య గొడవతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఐఏఎఫ్ యూనిఫాంను తప్పుగా చూపించారని, ట్రైలర్ లో ఉపయోగించిన పదజాలం సరిగా లేదని ఆరోపించింది. ట్రైలర్ లో చూపించినట్టు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఎక్కడా ఇలాంటి నియమాలు కనిపించవన్నారు. వెంటనే ఐఏఎఫ్ కు సంబంధించిన సీన్లను తొలగించాలని ట్వీట్ చేశారు. దీంతో చిత్ర బృందం అయోమయంలో పడింది. మరి ఐఏఎఫ్‌కి ఎటువంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.