పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో సంజన పేర్కొంది.
రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉండగా.. ఆశీష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఈ సంఘటనను పలువురు చూస్తున్నా ఎవ్వరూ అడ్డుకోలేదని సంజన వాపోయింది. బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశీష్‌ను పట్టించుకోలేదని ఆమె తెలిపింది. హోటల్ యాజమాన్యం కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను చూస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.