దేవీ శ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ అలియాస్ రాక్‌స్టార్ అలియాస్ దేవీ. టాలీవుడ్‌లో ఈ పేరుకో బ్రాండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా టాప్ మ్యూజిక్ డైరక్టర్‌గా ఆయన చలామణి అవుతున్నారు. ఆయన మ్యూజిక్ వింటే చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ల వరకు లేచి నిలబడి డ్యాన్సులు వేయాలనుకుంటారు. ఏదైనా సినిమా పోస్టర్ మీద ఈ పేరు కనిపించిందంటే చాలు.. ఆ సినిమా సగం హిట్ అయినట్లే అని అందరిలో ఓ నమ్మకం. అందుకే రెమ్యునరేషన్ ఎక్కువైనా దర్శకనిర్మాతలు కూడా చాలామంది అతడివైపే మొగ్గుచూపేవారు. అయితే ఇప్పుడు అతడి గ్రాఫ్ మెల్లగా పడిపోతూ వస్తోంది. తన మ్యూజిక్ తానే రిపీట్ చేస్తున్నాడంటూ వీక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడికి ఆఫర్లు సన్నగిల్లుతున్నాయి. అంతేకాదు పలువురు దర్శకులు కూడా ఆయనను దూరం పెడుతున్నారు. తాజాగా కిశోర్ తిరుమల కూడా దేవీని దూరం పెట్టాడు.
రామ్‌తో తాను తెరకెక్కిస్తోన్న రెడ్ చిత్రానికి మొదటిసారి మెలోడి బ్రహ్మ మణిశర్మతో పనిచేయబోతున్నాడు కిశోర్ తిరుమల. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే కిశోర్ తిరుమల ఇప్పటివరకు నాలుగు చిత్రాలను తెరకెక్కించారు. మొదట తీసిన ‘సెకండ్ హ్యాండ్’ మినహాయించి.. ఆ తరువాత తెరకెక్కించిన ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘చిత్రలహరి’ చిత్రాలకు దేవీతో పనిచేశాడు. అందులో ఉన్నది ఒక్కటే జిందగీ కాస్త యావరేజ్‌గా ఆడినప్పటికీ.. మ్యూజికల్‌గా మాత్రం అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్లుండి ఇప్పుడు దేవీతో బ్రేకప్ చేసుకున్నాడు కిశోర్. నిర్మాతల చాయిస్‌నో, హీరో చాయిస్‌నో లేక తనకు ఏదైనా విబేధాలు వచ్చాయో తెలీదు గానీ ఇప్పుడు దేవీ, కిశోర్‌కు దూరమయ్యాడు. మరి ఈ దూరమన్నది ఇదొక్క సినిమాకేనా..? లేక కొనసాగుతుందా..? అసలు కిశోర్ తిరుమల, దేవీ మధ్య ఏం జరిగింది..? అనే విషయాలకు సమాధానం కాలమే చెప్పాలి.
అయితే కిశోర్ తిరుమలనే కాదు గతంలోనూ దేవీ శ్రీతో పనిచేసిన పలువురు దర్శకులు ఆ తరువాత అతడికి దూరం అవుతూ వచ్చారు. ఈ లిస్ట్‌లో శ్రీనువైట్ల, త్రివిక్రమ్ ఉన్నారు. వీరద్దరికీ కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లను ఇచ్చాడు దేవీ. కానీ ఆ తరువాత దేవీని వదులుకోగా.. ప్రత్యామ్నాయంగా వేరే వారిని తీసుకున్నారు. ఇక ఈ మధ్యన కొరటాల శివ కూడా దేవీని దూరం పెట్టాడని.. చిరు మూవీ కోసం బాలీవుడ్ సంగీత దర్శకుడిని తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అంతేకాదు అనిల్ రావిపూడికి, దేవీకి మధ్య కూడా విబేధాలు నడుస్తున్నట్లు ఫిలింనగర్‌లో జోరుగా పుకార్లు నడుస్తున్నాయి. ఏదేమైనా టాలీవుడ్‌లో కొత్త కొత్త సంగీత దర్శకులు పుట్టుకుస్తోన్న నేపథ్యంలో.. దేవీ తన పంథాను మార్చుకోకుంటే తప్ప.. మ్యూజిక్ డైరక్టర్‌గా టాప్‌లో నిలవడం చాలా కష్టమని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరి ఇప్పటికైనా దేవీ తన రూట్ మార్చి.. కొత్త కొత్త ట్యూన్స్‌తో మెప్పించి.. మళ్లీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి. కాగా ప్రస్తుతం దేవీ.. మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో పాటు నితిన్ ‘రంగ్ దే’, అల్లు అర్జున్ 20వ చిత్రం, కీర్తి సురేష్- నగేష్ కుకునూర్, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.