OTTలను నిరోధించండి! కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంటరీ ప్యానెల్‌

| Edited By: Ram Naramaneni

Mar 23, 2025 | 3:09 PM

పార్లమెంటరీ కమిటీ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నుండి అశ్లీల కంటెంట్‌ను ఇతర సోషల్ మీడియాలో షేర్ చేయడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వాన్ని కోరింది. AI సహాయంతో ఈ సమస్యను పరిష్కరించాలని సూచించింది. పదే పదే నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని, ప్రస్తుత చట్టాల సరిపోదని, తాజా సాంకేతికతలకు అనుగుణంగా కొత్త చట్టాలు అవసరమని పేర్కొంది.

OTTలను నిరోధించండి! కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పార్లమెంటరీ ప్యానెల్‌
Ott
Follow us on

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి అశ్లీల కంటెంట్‌ను ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేయడాన్ని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ ప్రభుత్వాన్ని కోరింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా పదే పదే నేరాలకు పాల్పడేవారికి నిరోధక శిక్ష విధించేలా చట్టాలను రూపొందించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను కోరింది. గత సంవత్సరం మార్చిలో అశ్లీల కంటెంట్‌ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసినట్లు ప్యానెల్‌ వెల్లడించింది. 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (ఏడు గూగుల్ ప్లేలో, 3 ఆపిల్ యాప్ స్టోర్‌లో), ఈ ప్లాట్‌ఫామ్‌లతో లింక్‌ అయి ఉన్న 57 సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్‌ చేసినట్ల మంత్రిత్వ శాఖ ప్యానెల్‌కు తెలిపింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2021లోని పార్ట్ 3.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల గురించి వివరిస్తుంది. ‘A’ రేటింగ్ ఉన్న కంటెంట్‌ను పిల్లలు యాక్సెస్‌ చేయకుండా ఇది నిరోధిస్తోంది. అయితే 18 OTTలు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లలో బ్లాక్ చేసిన కంటెంట్‌లు టెలిగ్రామ్ ఛానల్ వంటి ఇతర మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా అందుబాటు ఉంటోందని, దీన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను అందించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చట్టాలు సరిపోతాయా? తాజా సాంకేతికతల నేపథ్యంలో మరింత కఠినమైన చట్టాలు అవసరమా? అని కూడా ప్రశ్నించింది.

అశ్లీల కంటెంట్‌ విషయంలో పదే పదే నిబంధనలు అతిక్రమిస్తున్న వారిని కఠినంగా శిక్షించే నిబంధనను అమలు చేయాలని కమిటీ మంత్రిత్వ శాఖకు సలహా ఇచ్చింది. ఏఐ సాయంతో ప్రోగ్రామ్‌ల పేరు మార్చడం, IP అడ్రస్‌లు చిరునామాను మార్చుతూ.. కొన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు అదే తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తారా? అని కూడా కమిటీ అడిగింది. సోషల్, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో అడల్ట్‌ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న ఛానెల్స్‌పై సినిమాటోగ్రఫీ చట్టం 2023 కింద తీసుకున్న చర్యలను వివరించాలని బహుళ-పార్టీ ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.