ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ, ఆ మాటకొస్తే యావత్ ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ దృష్టి అంతా సలార్ మూవీపై ఉందన్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రంపై ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్‌తో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రభాస్ అభిమానులతో పాటు, సగటు సినీ ప్రేక్షకుడికి క్యూరియాసిటీ ఉంది.
ఈ అంచనాలకు అనుగుణంగానే ప్రశాంత్ నీల్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. నిర్మాణ విలువల్లే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా శృతీ హాసన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. నిజానికి పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉంటే టీజర్‌తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా తాజాగా ఓ వార్తపై మళ్లీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
సలార్ మూవీ రీమేక్ చిత్రమనేది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న వార్త సారాంశం. అయితే ఈ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు రీమేక్‌గానే సలార్ తెరకెక్కుతోందని గతంలో వార్తలు వచ్చాయి అయితే దీనిపై తర్వాత ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ గతంలో మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం సంగీత దర్శకుడు రవి మాట్లాడుతూ.. సలార్ చిత్రం ఉగ్రమ్‌కు రీమేక్ అన్నట్లు అర్థం వచ్చేలా కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు సదరు వీడియోలో ఉంది.
ఇంకేముందు సలార్ మూవీ రీమేక్ అంటూ మీడియా కోడై కూస్తోంది. అయితే రవి బస్రూర్ ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశాడు, ఏ సందర్భంలో ఆ ప్రస్తావ్తన వచ్చిందన్న దానిపై మాత్రం వీడియోలో క్లారిటీలేదు. కట్ చేసిన క్లిప్‌లో ఉన్న వ్యాఖ్యల ఆధారంగానే వార్తలు వచ్చినట్లు కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ వార్తలో ఏమాత్రం నిజం లేదని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..