Six BJP workers injured in West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతుండటంతో ఎప్పుడు ఎం జరుగుతుందోనంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజాగా బెంగాల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ కార్యకర్తలపై బాంబుతో దాడి చేశారు. రాష్ట్రంలోని దక్షిణ 24 పరగణ జిల్లాలోని రాంపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి క్రూడ్ బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి భారతీయ జనతా పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తల బృందం శుక్రవారం అర్ధరాత్రి పెళ్లికి హాజరై తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేశారు. అయితే అధికార తృణమూల్ పార్టీ నేతలే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 8 విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడత ఎన్నికలు మార్చి 27న.. చివరి విడుత ఏప్రిల్ 29న జరుగనున్నాయి.
పోలింగ్ తేదీలు:
తొలి విడత: మార్చి 27
రెండో విడత: ఏప్రిల్ 1
మూడో విడత: ఏప్రిల్ 6
నాలుగో విడత: ఏప్రిల్ 10
ఐదో విడత: ఏప్రిల్ 17
ఆరో విడత: ఏప్రిల్ 22
ఏడో విడత: ఏప్రిల్ 26
ఎనిమిదో విడత: ఏప్రిల్ 29
Also Read: