బీజేపీది హిందూత్వ రాజకీయం.. అంటూ బెంగాల్ ఎన్నికలకు ముందు దీదీ విమర్శలు. పోలింగ్ తర్వాత ఆమె జై శ్రీరామ్ అనక తప్పదు.. ఇది కమలనాథుల కౌంటర్. హాట్ హాట్ డైలాగులు, ఆరోపణలతో వేడిగా సాగుతోంది వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. ఇంకా మూడు దశలు మిగిలి ఉన్నాయి. మరో ల్లో 132 సీట్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇంకో రెండు వారాలే గడువు.
పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. బీజేపీ తరపున స్థానిక నేతలతో పాటు సీనియర్లు కూడా రంగంలోకి దిగారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రచార బాధ్యత అంతా మమతా బెనర్జీ మోస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం మమతా బెనర్జీ దామ్‌జూర్ సభలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై సీఎం మమత విరుచుకుపడ్డారు. నందిగ్రామ్ ముస్లింలను పాకిస్తానీలంటూ వ్యాఖ్యానించిన వారికి ఎన్ని నోటీసులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు…
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3న హూగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో పర్యటించిన మమత.. మైనారిటీ ఓటర్లందరూ ఏకం కావాలని మమత పిలుపునివ్వడం వివాదానికి దారితీసింది. దీనిపై కేంద్రమంత్రి ముక్తర్ అబ్బాస్ నఖ్వీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ.. 48గంటల్లో వివరణ ఇవ్వాలని దీదీకి నోటీసులు జారీచేసింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ప్రచారంలోకి దిగారు. మే 2వ తర్వాత మమతా బెనర్జీ ‘జై శ్రీరామ్’ అనక తప్పదని.. దీదీతో జై శ్రీరామ్ అనిపిస్తామని అన్నారాయన. హుగ్లీ జిల్లా కృష్ణరామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలోభాయన మాట్లాడారు యోగి. సీఏఏ ఉద్యమానికి తృణమూల్ కాంగ్రెస్ మద్దతు పలికిందని గుర్తుచేశారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి రోడ్ షోకి కోల్‌కతా అధికారులు అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బెహలా ప్రాంతంలోని స్థానిక పోలీస్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కమలం పార్టీ కార్యకర్తలు. చివరికు మిథున్ చక్రవర్తి లేకుండానే స్థానిక బీజేపీ అభ్యర్థి రోడ్‌షో నిర్వహించారు.
బెంగాల్ ఓటర్లు మమతా బెనర్జీకి విశ్రాంతి ఇచ్చి.. తమకు పని చేసే అవకాశం ఇస్తారని అన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. దిన్హటాలో రోడ్‌షో నిర్వహించారు. నడ్డా ర్యాలీకి బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. 294 శాసన సభ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో నాలుగో దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. నాలుగో దశలో 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ఏప్రిల్ 10న జరగనుంది.